
కొడుకు ప్రేమ... తండ్రి ప్రాణాలు తీసింది. కొడుకు ప్రేమించిన యువతి తండ్రి.. అతనిని హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం పుదుపాళయానికి చెందిన తంగవేల్(55)కు కుమారులు పెరియన్నన్(32), ప్రకాష్(24) ఉన్నారు. కొంగనాపురంలోని తంగవేల్ సమీప బంధువు సెల్వం కుమార్తె సంధ్య, ప్రకాష్ ప్రేమించుకుంటున్నారు. మార్చిలో ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. అదే నెల 24న ఓ ఆలయంలో వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు, గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి సంధ్యను ఆమె తండ్రి సెల్వంకు అప్పగించారు. ఈ క్రమంలో 29వ తేదీ మరోసారి వెళ్లిపోయారు.
ఆగ్రహానికి గురైన సెల్వం వారం రోజుల్లో తన కుమార్తెను అప్పగించాలని యువకుడి తండ్రి తంగవేల్‌ను హెచ్చరించాడు. ఆందోళన గురైన తంగవేల్ పోలీసులను ఆశ్రయించారు. ఎన్నికల అనంతరం పంచాయితీ పెడతామని పోలీసులు ఆయనకు నచ్చజెప్పిపంపారు. మంగళవారం రాత్రి పుదుపాళయానికి వచ్చిన సెల్వం, అతని బంధువులు సంధ్య ఆచూకీ కోసం తంగవేల్, ఆయన పెద్దకుమారుడు పెరియన్నన్‌ను నిలదీశారు.
కోపోద్రిక్తుడైన సెల్వం తంగవేల్, పెరియన్నన్‌పై కత్తితో దాడి చేశారు. స్థానికులు అక్కడికి రావడంతో సెల్వం పారిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో తంగవేలు మృతి చెందాడు. పెరియన్నన్ చికిత్స పొందుతున్నాడు. పోలీసుల తీరుపై తంగవేలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్వం, బంధువుల కోసం గాలిస్తున్నారు.