
Ajit Pawar: దివంగత రాజీవ్ గాంధీని 'మిస్టర్ క్లీన్' అని పిలిచేవారని, ఆయనలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందుతున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కొనియాడారు. మంగళవారం పూణెలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అజిత్ పవార్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంతో చేయి కలపడంపై వివరణ ఇచ్చారు.
తాను,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి కాన్వాయ్‌లో వెళ్తుండగా.. పూణె ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధాని ఘన స్వాగతం పలికారని తెలిపారు. వేదిక వద్దకు మోదీ వెళ్లే సమయంలో తనకు ఎక్కడ కూడా నల్లజెండాలు కనిపించలేదనీ, వాస్తవానికి రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి.. ఘన స్వాగతం పలికడం చూశాననీ, ప్రజలల్లో ప్రధాని మోడీకి విశేషమైన ఆదరణ ఉందని అన్నారు.
"శాంతిభద్రతల కోణంలో దేశంలో మంచి వాతావరణం ఉండాలని ఏ ప్రధానమంత్రి అయినా ఆలోచిస్తారు. మణిపూర్‌లో ఏమి జరిగినా ఎవరూ సమర్ధించలేదు. ప్రధానమంత్రి ఈ సమస్యను గ్రహించారు. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా దృష్టి సారించారు. అక్కడ ఏం జరిగినా అందరూ ఖండించారు" అని పవార్ అన్నారు. మే 3న (ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన) జరిగిన ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నామనీ, దోషులకు శిక్ష పడేలా కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని పవార్ అన్నారు.
అందుకే బీజేపీతో కలిసా..
దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ తన కుటుంబాలతో కలిసి చేసుకుంటే.. ప్రధాని మాత్రం దేశ సరిహద్దులలో సైనిక సైనికులతో జరుపుకుంటాడని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆయన చేస్తున్న పనిని చూస్తున్నామనీ, అంతర్జాతీయ స్థాయిలో మోదీకి మించిన పాపులారిటీ ఉన్న నాయకుడు మరొకరు లేరన్నదన్నారు. తాను ప్రతిపక్షంలో ఉండి నిరసనలు తెలపవచ్చు. ధర్నాలు చేయవచ్చు. కానీ, ఏ నిర్ణయం తీసుకోవాలన్న.. ఏ పని చేయాలనుకున్న అది అధికారంలో ఉన్నవారితోనే సాధ్యమన్నారు.
మహారాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే తాను బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరినట్లు ఎన్సీపీ నేత అజిత్ పవార్ తెలిపారు. మోదీజీకి మించిన పాపులారిటీ ఉన్న వ్యక్తి దేశంలో మరొకరు లేరని, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చేసిన కృషి ప్రసంశనీయమని అన్నారు. ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గౌరవం లభిస్తోందని డిప్యూటీ సీఎం అన్నారు. ఇందిరా గాంధీ ఇలాంటి గౌరవాన్ని పొందేవారు. రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ ఉండేదనీ, అదే విధంగా ప్రధాని మోడీని కూడా అదే విధంగా చూస్తున్నారని అన్నారు. గత నెలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నుండి బిజెపి-శివసేన ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే.