
మరి కొద్దిరోజుల్లో భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 వసంతాలు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రకోట వద్ద వేడుకలకు కేంద్రం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈసారి ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో ప్రజల ఆలోచనలకు స్థానం లభించనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయని పేర్కొంది. ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం కోసం మీ ఆలోచనలు ఏమిటి? @mygovindia ద్వారా మీ ఆలోచనలు పంచుకోండి’’ అని పీఎంవో దేశ ప్రజలను కోరింది.
MyGov.in పోర్టల్ ద్వారా కూడా ఈ పిలుపును ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ ప్రసంగంలో తన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తారని తెలిపారు. నాలుగేళ్ళ నుంచి నేరుగా ప్రజల ఆలోచనలు, సలహాలను కోరుతున్న విషయాన్ని పీఎంవో వర్గాలు గుర్తు చేశాయి. ఈ ఏడాది కూడా ప్రజలు నవ భారతం కోసం తమ సలహాలను అందజేయాలని కోరింది. సలహాలకు అక్షర రూపం ఇచ్చి, తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు పంపించిన అంశాల్లో కొన్నింటిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తారని పీఎంవో అధికారులు తెలిపారు.
కాగా, ఈ ట్వీట్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కొందరు పెగాసస్, రఫేల్, పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాలు వంటివాటి గురించి మాట్లాడాలని కోరగా... మరికొందరు మాత్రం కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.