కొత్త వేరియంట్ దెబ్బతో మన దేశంలోకి విదేశాల నుంచి వచ్చే వారిపై మళ్లీ ఆంక్షలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర రాజధాని ముంబయి టెస్టులు, క్వారంటైన్ నిబంధనలు ప్రకటించాయి. ఐరోపా, యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా సహా పలు దేశాల నుంచి గుజరాత్‌లోకి ప్రవేశించే వారందరూ ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవడం ఇక నుంచి తప్పనిసరి. కాగా, ముంబయిలో ఎయిర్‌పోర్టులో దిగే వారు తప్పకుండా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని మేయర్ వెల్లడించారు.
ముంబయి: కరోనా(Corona) వైరస్ కొత్త వేరియంట్(Variant) ఒమిక్రాన్(Omicron) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. దీని ప్రమాద తీవ్రపై సమగ్ర అవగాహన ఇంకా లేనప్పటికీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం, వేగంగా వ్యాపించే ఇతర వేరియంట్ల కంటే ఇది అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు తెలుస్తున్నది. రీ ఇన్‌ఫెక్షన్ అవకాశాలూ ఎక్కువ ఉన్నట్టు సమాచారం. దీంతో ప్రపంచ దేశాలు మళ్లీ ట్రావెల్ బ్యాన్ విధించడానికి పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉండగా, భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలూ ఆంక్షలు(Restrictions) విధించే ఆలోచనలు చేస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలు సమీపిస్తుండటంతో మళ్లీ విదేశాల నుంచి ఇక్కడకు, ఇక్కడ నుంచి విదేశాలకు ప్రయాణాలు పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే దేశంలో కొత్త వేరియంట్ పంజా విసరకుండా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నాయి.
దక్షిణాఫ్రికా నుంచి ముంబయి నగరానికి వచ్చే వారందరికీ టెస్టులు, క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తామని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కిశోరి పెడ్నేకర్ వెల్లడించారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అందుకే దక్షిణాఫ్రికా నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తామని, క్వారంటైన్‌నూ పాటించే నిబంధనలు అమలు చేస్తామని వివరించారు. అంతేకాదు, వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు కూడా పంపిస్తామని తెలిపారు.
undefined
క్రిస్మస్ పండుగ సమీపిస్తున్నదని, ప్రపంచ దేశాల నుంచి చాలా మంది తమ బంధువులు, మిత్రులు, కుటుంబాలను కలుసుకోవడానికి మహారాష్ట్ర, ముంబయి నగరానికి వస్తుంటారని అన్నారు. ఈ నేపథ్యలోనే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని వివరించారు. చాలా దేశాల్లో కొత్త వేరియంట్‌పై తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. అవి కూడా ఆంక్షలకు సిద్ధమవుతున్నాయని, మనం కూడా అందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. అంతేకాదు, ముంబయి వాసులు మాస్కు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలనూ తప్పకుండా పాటించాలని అన్నారు.
ఇప్పటికైతే బీఎంసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ముంబయి ఎయిర్‌పోర్టు నుంచీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులకు విధించాలని భావిస్తున్న క్వారంటైన్ నిబంధనల వివరాలు రాలేవు.
Also Read: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. దక్షిణాప్రికా ప్రయాణాలపై యూరప్ బ్యాన్.. డబ్ల్యూహెచ్‌వో భేటీ
ఇదిలా ఉండగా గుజరాత్ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటున్నది. కేవలం దక్షిణాఫ్రికానే కాదు.. ఐరోపా దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఐరోపా దేశాలు, యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ దేశాల నుంచి గుజరాత్‌లోని అన్ని ఎయిర్‌పోర్టులకు వచ్చే వారు ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అని పేరుపెట్టింది. అత్యధిక వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం గల ఆందోళనకారక వేరియంట్‌గా దీన్ని పేర్కొంది. ఈ కేటగిరీలోనే డెల్టా వేరియంట్ కూడా ఉన్నది. కానీ, కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు వెంటనే దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణాలను నిషేధించే పనిలో పడ్డాయి.