ఆపరేషన్ బాలాకోట్: దాడులు ముగిసే వరకు మోడీ జాగారం

By Siva KodatiFirst Published Feb 27, 2019, 8:46 AM IST
Highlights

పుల్వామా దాడిలో మరణించిన సైనికుల ప్రతీ రక్తపు చుక్కు బదులు తీర్చుకుంటామన్న ప్రధాని నరేంద్రమోడీ... ఆ రోజు నుంచే పాక్‌లోని ఉగ్రతండాల అంతు చూడటంతో పాటు.. దాయాదికి గట్టి హెచ్చరిక పంపాలని నిర్ణయించుకున్నారు

పుల్వామా దాడిలో మరణించిన సైనికుల ప్రతీ రక్తపు చుక్కు బదులు తీర్చుకుంటామన్న ప్రధాని నరేంద్రమోడీ... ఆ రోజు నుంచే పాక్‌లోని ఉగ్రతండాల అంతు చూడటంతో పాటు.. దాయాదికి గట్టి హెచ్చరిక పంపాలని నిర్ణయించుకున్నారు.

దీనిలో భాగంగానే పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు ఏకంగా పాక్ భూభాగం మీదకు వెళ్లి ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. ఈ ఆపరేషన్‌ను స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ పర్యవేక్షించినట్లుగా తెలుస్తోంది.

దాడులు నిర్వహించిన సోమవారం రాత్రంతా ప్రధాని కంటి మీద కునుకు లేకేండా మేల్కొన్నట్లుగా సమాచారం. ఆపరేషన్‌కు వెళ్లిన పైలట్లు, యుద్ధ విమానాలు సురక్షితంగా భారత భూభాగం మీదకు వచ్చిన తర్వాతే ఆయన ఊపిరి పీల్చుకున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

సోమవారం రాత్రి ఒక జాతీయ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అనంతరం లోక్‌ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. పది నిమిషాల్లో భోజనం ముగించి, అక్కడి నుంచి వైమానిక దాడుల ఆపరేషన్‌‌ పర్యవేక్షణలో మునిగినట్లు తెలుస్తోంది.

ఆపరేషన్‌కు ముందు జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత ఆయన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌, వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారని తెలుస్తోంది.

యుద్ధ విమానాలు భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తెల్లవారుజామున 4.30 గంటలకు ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపిన ప్రధాని ఆ తర్వాతే విశ్రమించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

click me!