పాకిస్తాన్ నుంచి పొగడ్తలు కోరుకుంటున్నారా? ఆ నేతలపై కేంద్ర మంత్రి ఫైర్

By telugu teamFirst Published Sep 6, 2021, 5:06 PM IST
Highlights

కిసాన్ మహాపంచాయత్ ఒక రాజకీయ సభగా పేర్కొంటూ రైతు నేతలపై కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ మండిపడ్డారు. వారు పాకిస్తాన్ నుంచి ప్రశంసలు కోరుకుంటున్నారా? అని ఆగ్రహించారు. దేశ శత్రువుల అల్లుతున్న ఉచ్చుల పడవద్దని, ఇతర రాజకీయ పార్టీల చేతుల్లోనూ కీలుబొమ్మలుగా మారవద్దని సూచించారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం రైతులు నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌పై కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ విమర్శలు కురిపించారు. కిసాన్ మహాపంచాయత్‌ను ఒక రాజకీయ సభగా పేర్కొన్నారు. రైతు నేతలకు హెచ్చరికలు చేశారు. వారు పాకిస్తాన్ నుంచి పొగడ్తలు ఆశిస్తున్నారా? అని మండిపడ్డారు.

ముజఫర్‌నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి బాల్యన్.. ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌పై పాకిస్తాన్ రేడియో ట్వీట్‌ను పేర్కొంటూ మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నప్పుడు ర్యాలీలు నిర్వహించడం సర్వసాధారణమేనని, ఉత్తరప్రదేశ్‌లో ఇవి అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. కానీ, రైతు నేతలు ఒక విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వారు పాకిస్తాన్ నుంచి ప్రశంసలు కోరుకుంటున్నారా? లేదా? అనేది స్పష్టం చేసుకోవాలన్నారు. ఇది వారే స్వయంగా నిర్ణయించుకోవాలని తెలిపారు. అలాగే, కొన్ని పార్టీల రాజకీయ దుష్ప్రచారం నుంచి తప్పుకోవాలని, వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారకూడదని హెచ్చరించారు. మహాపంచాయత్ కార్యక్రమంలో పలుపార్టీల జెండాలనూ అందరూ చూశారని వివరించారు.

రైతు నేత రాకేశ్ తికాయత్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి విమర్శలు కురిపించారు. ముజఫర్‌నగర్‌లో అల్లర్లు చెలరేగినప్పుడు ట్రాక్టర్ ర్యాలీని తికాయత్ చేపట్టడం బాధాకరమని అన్నారు. ఎర్రకోటకు రైతుల ట్రాక్టర్ ర్యాలీని తీసుకెళ్లింది ఎవరో అందరికీ తెలుసు అని ఆరోపించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే, మార్చిలో తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. తాము అందరినీ ఓట్లు అడుగుతామని, మహాపంచాయత్‌లో పాల్గొన్నవారినీ అడుగుతామని వివరించారు. ఎందుకంటే 2012 నుంచి 2017లో రాష్ట్రంలోని పరిస్థితులను ఎవరూ విస్మరించబోరని అన్నారు.

click me!