మోడీ నేతృత్వంలో ఐరాసలో డిబేట్.. రష్యా అధ్యక్షుడి థాంక్స్

By telugu teamFirst Published Aug 10, 2021, 12:12 PM IST
Highlights

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఆగస్టు నెలకుగాను భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో ఓ డిబేట్‌ జరిగింది. భద్రతా మండలిలో భారత ప్రధాని సారథ్యంలో డిబేట్ జరగడం ఇదే ప్రథమం. ఇందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓపెన్ డిబేట్‌కు మనదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. భద్రతా మండలిలో భారత ప్రధాని నేతృత్వంలో సంవాదం జరగడం ఇదే తొలిసారి. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో డిబేట్ నిర్వహించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఘనత సాధించారు. ఐరాస భద్రతా మండలికి గతనెల ఫ్రాన్స్ అధ్యక్షత వహించగా, ఆగస్టు
నెలకుగాను భారత్‌ ఈ బాధ్యతలు నిర్వహించనుంది. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సోమవారం సముద్ర భద్రతపై ఉన్నతస్థాయి ఓపెన్ డిబేట్ జరిగింది.

ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ సముద్ర మార్గాల్లో నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. పర్యారణహితానికి కట్టుబడి ఉండాలని, అవసరానికి మించి మత్స్య సంపదను వేటాడవద్దని సూచించారు. సముద్రమార్గాల ద్వారా దేశాల మధ్య స్నేహాన్ని మరింత పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా వియత్నాం, నైగర్, కాంగో దేశాల ప్రధానులు, కీలక రీజనల్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

మోడీ గారు.. థాంక్యూ
‘ఐరాస భద్రతా మండలికి అధ్యక్షత వహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, అత్యంత కీలకమైన, సున్నితమైన అంశం సముద్ర భద్రతపై చర్చకు శ్రీకారం చుట్టినందుకు థాంక్ యూ. అంతర్జాతీయంగా భారత్ నిర్వహిస్తున్న నిర్మాణాత్మక కృషిని కొనసాగిస్తున్నందుకు అభినందనలు. బహుళ ప్రయోజనాలు, పరస్పర లబ్ది, సహకారానికి భారత్ దోహదపడుతున్నది. సముద్రాలు, మహాసముద్రాలు ప్రజలను, నాగరికతలను కలిపి ఉంచుతాయి. కానీ, సముద్ర మార్గాల్లో నేరాలు, దోపిడీలు, ఇతర ముప్పులు ఎక్కువవుతుండటం బాధాకరం. వీటిపై నేడు సమీక్షించుకోవడం ముఖ్యమైన విషయం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

click me!