
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మనసు చాటుకున్నారు. ఉత్తరాఖండ్‌లో ఆదివారం చోటు చేసుకున్న మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు గాను ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మరణించిన ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ .50 వేలు ఇచ్చేందుకు గాను మోడీ ఆమోదం తెలిపారు.
అంతకుముందు వరదల విషయంపై పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి స్పందించారు. ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ప్రజలు ఈ ఘటనను ధైర్యంతో ఎదుర్కొంటారని మోడీ ఆకాంక్షించారు. పరిస్ధితిని తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ క్లిష్ట పరిస్దితుల్లో దేశం మొత్తం ఉత్తరాఖండ్ వెంటే ఉంటుందని తెలిపారు.
కాగా, చమోలీ జిల్లాలోని జోషిమఠ్ ప్రాంతంలో మంచుచరియలు విరిగి పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ధౌలి గంగానది నీటి ప్రవాహం పెరిగింది. వరద ధాటికి తపోవన్- రేనీ ప్రాంతంలో ఉన్న రుషిగంగా పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా దెబ్బతింది.
నీటి ప్రవాహం ధాటికి ప్రాజెక్ట్ సహా పలు ఇళ్లు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. ధౌలి గంగా ఉప్పొంగిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
పరిసర గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పౌరీ, తెహ్రీ, రుద్ర ప్రయాగ్, హరిద్వార్, దేహ్రాదూన్ జిల్లాలో హైఅలెర్ట్ ప్రకటించింది. మెరుపు వరదల్లో గల్లంతైన వారిలో 16 మందిని ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ దళం కాపాడింది.
వరద ఉద్ధృతికి రేనీ- తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే మరో మూడు వంతెనలు సైతం దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) అధికారులు వెల్లడించారు.