ఉత్తరాఖండ్ వరదలు: 16 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్

By Siva KodatiFirst Published Feb 7, 2021, 7:28 PM IST
Highlights

ఉత్తరాఖండ్ మెరుపు వరదల్లో గల్లంతైన 16 మందిని రక్షించాయి సహాయక బృందాలు. మరోవైపు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. తపోవన్ డ్యామ్ దగ్గర టన్నెల్‌లో ఇంకా 20 మంది కార్మికులు వున్నట్లు సమాచారం

ఉత్తరాఖండ్ మెరుపు వరదల్లో గల్లంతైన 16 మందిని రక్షించాయి సహాయక బృందాలు. మరోవైపు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. తపోవన్ డ్యామ్ దగ్గర టన్నెల్‌లో ఇంకా 20 మంది కార్మికులు వున్నట్లు సమాచారం.

ప్రమాద సమయంలో డ్యామ్ వద్ద 140 మంది వున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరమ్మత్తు పనులు చేసేందుకు వెళ్లిన సమయంలో ధౌలీగంగా నది ఉగ్రరూపం దాల్చింది.

మంచు చరియలు విరిగిపడటంతో ఉన్నట్లుండి నీటి ప్రవాహం పెరిగింది. వరద ఉద్ధృతికి ఎన్‌టీపీసీ తపోవన్ డ్యామ్, రుషిగంగా డ్యామ్ దెబ్బతిన్నాయి. ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్న 150 మందికి పైగా సిబ్బంది గల్లంతయ్యారు.

దీంతో రంగంలోకి దిగిన ఐటీబీపీ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే టన్నెల్ మొత్తం బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.

దాంతో నేవీ సెయిలర్స్‌ను రంగంలోకి దించారు. అలాగే ఢిల్లీ నుంచి మరో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పిస్తున్నారు. తపోవన్ డ్యామ్ దగ్గర వైద్య సిబ్బందిని సిద్దంగా వుంచారు. అయితే గల్లంతైన వారిలో 100 మంది వరకు చనిపోయి వుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 

click me!