
PM Modi Visits Vantara Wildlife Rescue Center : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూగజీవాలను ఎంతగా ప్రేమిస్తారో బైటపడింది. నిత్యం బిజీబిజీగా ఉండే ఆయన జంతువులతో గడిపేందుకు సయమం కేటాయించారంటేనే వాటిని ఆయన ఎంతలా ఇష్టపడతారో అర్థం చేసుకొవచ్చు. అంతేకాదు స్వయంగా పులి పిల్లలకు ఆయన పాలు పడుతూ, ఏనుగులకు ఆహారం అందిస్తూ, కోతులను చేతిలోకి తీసుకుని ఆడిస్తూ, ఇతర జంతువులను నిమురుతూ... ఇలా గత ఆదివారం సొంతరాష్ట్ర గుజరాత్ లో జంతువులతో సరదాగా గడిపారు ప్రధాని మోదీ.
రిలయన్స్ ఫౌండేషన్ జామ్ నగర్ లో వంతారా పేరిట ప్రత్యేకంగా జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. సుమారు 3 వేల ఎకరాల్లో వివిధ జంతువుల సంరక్షణ కోసం ఏకంగా ఓ అడవినే సృష్టించారు. అంతేకాదు జంతువులకు చికిత్స కోసం అత్యాధునిక సదుపాయాలతో హాస్పిటల్ ను కూడా నిర్మించారు.
వంతారా జూపార్క్ కాదు... జంతువులను సంరక్షణా కేంద్రం. అంటే గాయపడిన జంతువులకు చికిత్స అందించడం, అంతరించిపోతున్న జాతులను సంరక్షించడం చేస్తుంటారు. ఇందులో 2,000 కంటే ఎక్కువ జాతులకు చెందిన 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి. వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ ఈ జంతు సంరక్షణ కేంద్రం బాధ్యతలు చూసుకుంటున్నారు.
గుజరాత్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటుచేసిన వంతారా వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రం (Wildlife Rescue Rehabilitation and Conservation Centre Vantara) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వంతారా అడవిని సందర్శించిన ఆయన జంతువులతో టైం స్పెండ్ చేశారు...ముఖ్యంగా సింహం పిల్లలను ఆయన చేతిలోకి తీసుకుని ఆహరం అందించారు. అలాగే మరికొన్ని జంతువులను కూడా ఏమాత్రం భయం లేకుండా చేతుల్లోకి తీసుకున్నారు.చిరుత పిల్లలతో సరదాగా ఆడుకున్నారు.
పీఎం మోదీ పాలుపట్టిన తెల్లని సింహం పిల్ల ఇటీవలే జన్మించింది. ఈ సింహం పిల్ల తల్లిని కాపాడి వంతారా వన్యప్రాణి కేంద్రంలో సంరక్షించారు. ఇక కారకల్స్ అనేవి ఇండియాలో అంతరించిపోతున్న జంతు జాతుల్లో ఒకటి. దీంతో వంతారాలో వీటిని సంరక్షించడమే కాదు వీటి పునరుత్పత్తికి చర్యలు చేపట్టారు. ఇలా ఆ జాతిని సంరక్షించి తిరిగి అడవుల్లో వదిలిపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇలా చిన్న జంతులతోనే కాదు పెద్దపెద్ద ఏనుగులు, పులులు, సింహాలను కూడా వంతారాలో సంరక్షిస్తున్నారు. వీటిని ప్రధాని మోదీ చాలా దగ్గరగా చూసారు... అలాగే అరుదైన పాములు, మొసళ్లను కూడా చూసారు.
వంతారాలో జంతువులకు కల్పిస్తున్న వివిధ సదుపాయాలను పీఎం మోదీ పరిశీలించారు. వన్యప్రాణుల కోసం నిర్వహిస్తున్న అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆసుపత్రికి ప్రధాని వెళ్లారు. అక్కడ జంతువుల వైద్య పరీక్షల కోసం ఏర్పాటుచేసిన ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాలను పరిశీలించారు. జంతువుల ఐసీయూ విభాగాన్ని పరిశీలించారు. వన్యప్రాణుల అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ సహా చాలా విభాగాలు ఈ హాస్పిటల్లో ఉన్నాయి.
ఇలా ప్రధాని మోదీకి వంతారా వన్యప్రాణి కేంద్రాన్ని దగ్గరుండి చూపించారు అనంత్ అంబానీ. ఇక్కడ జంతువులకు కల్పిస్తున్న ఏర్పాట్లను చూసిన ప్రధాని అనంత్ ను అభినందించారు. అనంత్ జంతువులపై చూపిస్తున్న ప్రేమను కళ్లారా చూసిన ప్రధాని ముగ్దుడయిపోయాడు... ఇలాగే వంతారా జంతువులతో కళకళలాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.