
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో గ్రాఫర్ అవతారం ఎత్తారు. ఆయనే స్వయంగా ఫోటోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా. ఇంతకీ మ్యాటరేంటంటే.. సోమవారం ఉదయం మోదీ సిక్కిం బయలు దేరి వెళ్లారు. అక్కడ ఈ రోజు ఆయన పాక్యాంగ్ విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సిక్కిం వెళ్తూ.. మార్గమధ్యలో కనిపించిన అందమైన దృశ్యాలను ఆయన చిత్రీకరించారు. వాటిని తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలను ఇన్ క్రెడిబల్ ఇండియా అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారు.
భారతదేశ పర్యాటకశాఖ ట్యాగ్ లైన్ గా ఇన్ క్రెడిబల్ ఇండియా అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కాగా.. దానిని మోదీ ఇక్కడ ప్రయోగించారు. ఆయన షేర్ చేసిన ఫోటోలు నిజంగానే చాలా అందంగా ఉన్నాయి. మంచు దుప్పటి కప్పుకున్న కొండలు, పర్వతాలు, మొత్తం పచ్చగా ఆహ్లాదంగా ఉన్న కొండల ఫోటోలను ఆయన తీశారు. కాగా.. ఆ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.