కోవిడ్ అలెర్ట్.. సీఎంలతో పీఎం మోడీ బుధవారం సమీక్ష.. కరోనా పరిస్థితులపై చర్చ!

Published : Apr 24, 2022, 08:24 PM IST
కోవిడ్ అలెర్ట్.. సీఎంలతో పీఎం మోడీ బుధవారం సమీక్ష.. కరోనా పరిస్థితులపై చర్చ!

సారాంశం

దేశంలో కరోనా కేసులు స్వల్పస్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిసింది.  

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్ప స్థాయిలో పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు పూర్తిగా ఎత్తేయగా.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని రాష్ట్రాలు స్వల్పంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం.. ముఖ్యంగా ఉత్తరాదిన స్కూళ్లలోనూ కేసులు రిపోర్ట్ కావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 27న అంటే బుధవారం సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో దేశంలోని కరోనా పరిస్థితులను సమీక్షించనున్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా, ఆయా శాఖలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ భేటీలో సమావేశం కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ దేశంలోని కరోనా పరిస్థితులు, కరోనా టీకా పంపిణీ పురోగతి, ముఖ్యంగా బూస్టర్ టీకా పంపిణీ, ఎక్కువ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలకు సంబంధించిన వివరాలను ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.

గతంలో ప్రధాని మోడీ ఇలా సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దేశంలోని కరోనా స్థితిగతుల గురించి చర్చించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రులతోనే కాదు.. జిల్లా కలెక్టర్లతోనూ ఆయన గతంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,593 కరోనా కేసులు నమోదయ్యాయి. 44 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,57,545కి చేరింది. మరోవైపు మొత్తం మరణాల సంఖ్య 5,22,193కి పెరిగింది. 

గత కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల చోటుచేసుకోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. దేశంలో ప్రస్తుతం 15,873కి చేరింది. కిందటి రోజుతో పోల్చితే 794 యాక్టివ్ కేసులు పెరిగాయి. మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.75 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1,755 కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా  నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,19,479కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 0.59 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.54 శాతంగా ఉంది. 

ఇక, గడిచిన 24 గంటల్లో 4,36,532 పరీక్షలు నిర్వహించినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య 83.47 కోట్లకు చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం రోజున దేశంలో 19,05,374 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,87,67,20,318కి చేరింది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం