ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.. ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ: డిప్యూటీ సీఎం అజిత్ పవార్

Published : Jul 02, 2023, 04:21 PM ISTUpdated : Jul 02, 2023, 04:26 PM IST
ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.. ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ: డిప్యూటీ సీఎం అజిత్ పవార్

సారాంశం

ఎన్సీపీకి చెందిన దాదాపు అందరు ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.   

మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలోని  ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్‌తో సహా తొమ్మిది మంది ఎన్సీపీ  ఎమ్మెల్యేలకు షిండే కేబినెట్‌లో చోటు దక్కింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ  స్వీకారం చేసిన అనంతరం అజిత్ పవార్ ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీకి చెందిన దాదాపు అందరు ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము ఈరోజు ప్రమాణం చేశామని.. తదుపరి విస్తరణలో మరికొందరిని మంత్రులను చేర్చుకుంటామని తెలిపారు. 

‘‘ఈ రోజు మేము మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. మేము మంత్రులుగా ప్రమాణం చేసాము. తరువాత శాఖలపై చర్చ ఉంటుంది. జాతీయ స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. మేము అభివృద్దికి మద్దతు ఇవ్వాలని అనుకున్నాము’’ అని అజిత్ పవార్ పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. 

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని చెప్పారు. మోదీ ఇతర దేశాలలో కూడా ప్రజాదరణ పొందారని అన్నారు. అందరూ ఆయనకు మద్దతునిస్తున్నారని, ఆయన నాయకత్వాన్ని అభినందిస్తున్నారని చెప్పారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వారితో (బీజేపీ) కలిసి పోటీ చేస్తామని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 

ఎమ్మెల్యేలందరూ తన వెంట ఉన్నారని.. తమకు అన్ని సంఖ్యలు ఉన్నాయని చెప్పారు. తాము ఇక్కడ ఒక పార్టీగా ఉన్నామని.. సీనియర్లందరికీ కూడా తెలియజేశామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీకి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. తమ పార్టీకి 24 ఏళ్లు అని.. యువ నాయకత్వం ముందుకు రావాలని కోరారు. 

Also Read: బిగ్ ట్విస్ట్, షిండే ప్రభుత్వంలోకి అజిత్ పవార్ వర్గం.. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం..

‘‘ప్రతిపక్షాలు కలిసి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాయి.. కానీ ప్రతి రాష్ట్రంలో వారికి వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి. ప్రతిపక్షాల సమావేశంలో ఎటువంటి ఫలితం లేదు’’ అని అజిత్ పవార్ చెప్పారు. ‘‘దేశ ప్రయోజనాల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతను నేను చూడలేదు. నిజానికి 1984 నుంచి దేశాన్ని ఏ నాయకుడూ ఒంటి చేతితో నడిపించలేదు. కానీ ప్రధాని మోదీ గత తొమ్మిదేళ్లుగా అదే చేస్తున్నారు. ఆయనకు విదేశాల్లో కూడా ప్రజాదరణ ఉంది. మేము మోదీ చేస్తున్న అభివృద్ధిలో భాగం కావాలని అనుకుంటున్నాం’’ అని అజిత్ పవార్ అన్నారు.

మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజబల్ మాట్లాడుతూ.. ‘‘మేము ప్రభుత్వంలో మూడవ పార్టీగా చేరాము. కొందరు మేము పార్టీని చీల్చామని అంటున్నారు.. కానీ అది సరికాదు. మేము ఎన్సీపీగా ఇక్కడకు వచ్చాము. మేము అనేక సందర్భాల్లో మోడీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాము.. కానీ దేశం ఆయన చేతుల్లో సురక్షితంగా ఉందన్నది నిజం. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానిగా వస్తున్నారని పవార్ సాహెబ్ స్వయంగా చెప్పారు.. సానుకూల సూచనగా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వంతో రావాలని నిర్ణయించుకున్నాం’’ అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !