రాత్రికి రాత్రే ఆ ఆలయం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహం మాయం

By telugu teamFirst Published Aug 19, 2021, 7:11 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం పూణెకు చెందిన ఓ బీజేపీ వర్కర్ మందిరాన్ని నిర్మించాడు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం తీవ్ర అభ్యంతరం తెలుపడంతో ఆలయంలోని ప్రధాని విగ్రహాన్ని రాత్రికి రాత్రే స్థానిక బీజేపీ కౌన్సిలర్ నివాసానికి తరలించారు.
 

ముంబయి: మహారాష్ట్రలోని పూణెలో ఓ బీజేపీ కార్యకర్త నిర్మించిన పీఎం నరేంద్ర మోడీ ఆలయంలోని ప్రధాని  విగ్రహం రాత్రికి రాత్రే మాయమైంది. ప్రధానమంత్రి కార్యాలయం తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ఆలయంలోని నరేంద్ర మోడీ విగ్రహాన్ని తొలిగించారు. ఆలయాన్ని కవర్‌ను తొడిగి మూసేశారు.

37ఏళ్ల బీజేపీ వర్కర్ మయూర్ ముండే పూణెలోని ఔంధ్ ఏరియాలో రూ. 1.60లక్షలతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. జైపూర్‌లో లభించే రెడ్ మార్బుల్స్‌తో ఆలయాన్ని కట్టాడు. ఆలయం గురించి ముండే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆరు నెలలుగా ఈ నిర్మాణం జరిగిందని వివరించారు. ఆగస్టు 15న తానే ప్రారంభించినట్టు తెలిపారు. చుట్టుపక్కల ప్రజల్లోనూ ఆలయంపై ఆసక్తి పెరుగుతున్నదని చెప్పారు.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగమందుకున్నాయని ముండే అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 మొదలు, ట్రిపుల్ తలాఖ్, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయడం వరకు అనేక రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. అయోధ్యలో రామ మందిరానికి మార్గం సుగమం చేసిన వ్యక్తికి ప్రత్యేకంగా తన నివాసంలో ఒక ఆలయం ఉండాలని భావించారని చెప్పారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయాన్ని తన నివాసంలో నిర్మించారని తెలిపారు.

ప్రధాని మోడీ ఆలయం గురించి వార్తాసంస్థల ద్వారా దేశవ్యాప్తంగా తెలియవచ్చింది. ఈ విషయం తెలియగానే ప్రధానమంత్రి కార్యాలయం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని మూసేసినట్టు తెలిసింది. ఆలయంలోని ప్రధానమంత్రి మోడీ విగ్రహాన్ని స్థానిక బీజేపీ కౌన్సిలర్ ఇంటికి తరలించినట్టు సమాచారం.

ప్రధాని మోడీ ఆలయంపై ఎన్సీపీ కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. వచ్చే ఏడాది పూణె మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్సీపీ విమర్శలు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయం దగ్గరకు గురువారం ఉదయం చేరుకుంటామని ఎన్సీపీ వర్కర్లు ప్రకటించారు. అంతేకాదు, ఆలయం ముందు ‘భోగి’ వేడుకలూ చేసుకుంటామని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాలు తీవ్రమవ్వకముందే మోడీ విగ్రహాన్ని తొలగించినట్టు తెలుస్తున్నది.

click me!