
Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రవత్తరంగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న రాజకీయ పార్టీల మధ్య .. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేతలను ఉద్దేశించి పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ చేసినా..యుపి, బీహార్ కే భయ్యా వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇరుపక్షాల నేతలు ఒకరిని మించి మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ 'యుపి, బీహార్ కే భయ్యా' వ్యాఖ్యను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా సంత్ రవిదాస్ వారసత్వాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఆరోపించారు ప్రధాని.
పంజాబ్‌లోని అబోహర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చన్నీ వ్యాఖ్యల్ని ఖండించారు. ప్రాంతీయత ఆధారంగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. ఈ తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన 'యుపి, బీహార్ కే భయ్యా' వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌కు రానివ్వొద్దని ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చెప్పడాన్ని ప్రధాని తీవ్రంగా ఖండించారు.
ఇలాంటి వివాదస్పద ప్రకటనలతో ఎవరిని అవమానిస్తున్నారు? ఉత్తరప్రదేశ్ లేదా బీహార్‌కు చెందిన మన సోదరులు మరియు సోదరీమణులు కష్టపడి పని చేయని ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ.. ఈ దేశం నిన్ననే సంత్ రవిదాస్ జయంతిని జరుపుకున్నది. వారు ఎక్కడ పుట్టారు? అంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో, బనారస్‌లో.. ఉన్న సంత్ రవిదాస్‌ను కూడా తరిమికొడతారా? అతని పేరు చెరిపేస్తారా ? గోవింద్ సింగ్ ఎక్కడ జన్మించారు? బీహార్‌లోని పాట్నా సాహిబ్‌లో... గురుగోవింద్ జీని కూడా పంజాబ్ నుండి బహిష్కరిస్తారా?" అని ప్రశ్నించారు. పంజాబ్.. సరిహద్దు రాష్ట్రం. సరిహద్దుల అవతల నుండి మన భూమిపై కన్నేసే ఉంటారు. మన దేశం మీద దాడి చేయాలని చూస్తూనే ఉంటారు. వారితో మన మొండి వైఖరితోనే ఉండాలని అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా మోదీ విరుచుకుపడ్డారు. ‘‘మిమ్మల్ని ఢిల్లీకి రానివ్వనివారు, ఇప్పుడు పంజాబ్‌కు వచ్చి మీ ఓట్లు కోరుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
బీజేపీ ప్రభుత్వ పథకాల వల్ల ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, చికిత్స అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. నూతన దార్శనికతతో కూడిన ప్రభుత్వం పంజాబ్‌కు అవసరమని చెప్పారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువత గొప్ప మార్పు తీసుకురాగలదన్నారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా మోదీ గురువారం బీజేపీ కూటమి తరపున అభోర్‌లో జరిగిన సభలో మాట్లాడారు.
రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనేని చరిత్ర చెబుతుందన్నారు. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ఫైళ్ల మీద కూర్చుని, పడుకుని కాలక్షేపం చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే ఆ సిఫార్సులను అమలు చేశామని తెలిపారు. పంజాబ్‌లో మాఫియా పాలనను కేవలం బీజేపీ మాత్రమే మార్చగలదని చెప్పారు.
పీఎం-కిసాన్ పథకం వల్ల రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్థాన్‌ది ఒకే విధమైన ఎజెండా అని మండిపడ్డారు.