పీఎం సీటు డిగ్నిటీని కాపాడండి.. చరిత్రను వక్రీకరించొద్దు: ప్రధాని మోడీపై మన్మోహన్ సింగ్ ఫైర్

Published : Feb 17, 2022, 03:16 PM IST
పీఎం సీటు డిగ్నిటీని కాపాడండి.. చరిత్రను వక్రీకరించొద్దు: ప్రధాని మోడీపై మన్మోహన్ సింగ్ ఫైర్

సారాంశం

ప్రధాని మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి సీటుకు ఒక డిగ్నిటీ ఉంటుందని, దాన్ని అలాగే కాపాడాలని సూచించారు. స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి దిగజారి చరిత్రను వక్రీకరించవద్దని అన్నారు. బ్రిటీష్‌వారి విభజించు పాలించు విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్నదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి నకిలీ జాతీయవాదం అని, అది దేశానికి ఎంతో ప్రమాదకరం అని హెచ్చరించారు.   

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi)పై మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్(Former PM Manmohan Singh) మండిపడ్డారు. ప్రధానమంత్రి పొజిషన్(PM Postition) అంటే ఒక స్టేచర్ ఉంటుందని, దాని డిగ్నీటి(Dignity)ని మంటగలపవద్దని విమర్శించారు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చరిత్రను వక్రీకరించవద్దని అన్నారు. మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru)ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆంగ్లేయులు అవలంబించిన విభజించు పాలించు అనే పాలనా విధానాన్ని పాటిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రజలను విభజించే వ్యాఖ్యలు, విధానాలు అవలంబించలేదని, అలాగే, తప్పుడు వ్యాఖ్యానం కోసం వాస్తవాలను తొక్కిపెట్టలేదని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఒక వైపు ప్రజలు పెరిగిన ధరలు, నిరుద్యోగంతో బాధపడుతుంటే.. మరో వైపు ప్రస్తుత ప్రభుత్వం వారి పొరపాట్లను గుర్తించి.. సరిదిద్దుకోకుండా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను నిందిస్తున్నదని ఆయన తన వీడియో మెసేజీలో విమర్శించారు. ప్రధాన మంత్రి పొజిషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని నేను ఫీల్ అయ్యానని, ప్రధాని ఆ సీటు డిగ్నిటీని కాపాడాలని పేర్కొన్నారు. అంతేకాదు, స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చరిత్రను వక్రీకరించవద్దని తెలిపారు. తాను పదేళ్లు ప్రధానిగా సేవలు అందించినప్పుడు నా పనులతో మాట్లాడానని వివరించారు. ప్రపంచం ముందు మన దేశ ప్రతిష్ట ఎక్కడా మసకబారకుండా చూసుకున్నానని తెలిపారు. భారత గౌరవాన్ని తాను ఎక్కడ తక్కువ చేయలేదని చెప్పారు.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక విధానాలపై అవగాహన ఏమాత్రం లేదని మన్మోహన్ సింగ్ విమర్శలు కురిపించారు. వీరు కేవలం దేశంలోనే కాదు.. విదేశాంగ విధానాల్లోనూ విఫలం అయ్యారని వివరించారు. మన దేశ సరిహద్దులో చైనా కాపుకాచుకుని కూర్చున్నదని, కానీ, దాని చొరబాట్లను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవడం, వారికి బిర్యానీ తినిపించడం వంటి మార్గాల్లో విదేశాంగ వ్యవహారాలను చక్కబెట్టలేమని ప్రధాని మోడీ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నట్టు తెలిపారు.

తాము ఎన్నడూ రాజకీయ లబ్ది కోసం దేశాన్ని విభజించలేదని సింగ్ అన్నారు. అలాగే, వాస్తవాలను కప్పిపెట్టాలని ఎన్నడూ ప్రయత్నించలేదని వివరించారు. భారత దేశాన్ని, దేశ ప్రధాని పదవిని తాము ఎన్నడూ తక్కువ చేయలేదని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజలను విభజిస్తున్నదని, ఈ ప్రభుత్వం నకిలీ జాతీయవాదాన్ని పాటిస్తున్నదని, ఇది దేశానికి ప్రమాదకరం అని వివరించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను తాము ఎన్నడూ బలహీనపరచలేదని అన్నారు.

ప్రధాని భద్రతా లోపం అనే ఒక అంశాన్ని పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై బుదరజల్లడానికి ప్రయత్నించారని మన్మోహన్ సింగ్ అన్నారు. రైతు ఆందోళన సమయంలోనూ పంజాబ్, పంజాబియత్‌ను అవమానపరిచే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయని పేర్కొన్నారు. పంజాబీలు చేసిన త్యాగాలకు ప్రపంచం సలాం చేస్తున్నదని వివరించారు. కానీ, ఎన్‌డీఏ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడదని ఆక్షేపించారు. పంజాబ్ నుంచి ఒక నిజమైన భారతీయుడిగా ఇవన్నీ నను బాధిస్తున్నాయని వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?