independence day: నూతన భారత నిర్మాణానికి ‘సబ్ కా ప్రయాస్’ అత్యావశ్యకం: ప్రధాని మోడీ

By telugu teamFirst Published Aug 15, 2021, 8:19 AM IST
Highlights

స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను అమృత్ మహోత్సవ్‌కే వేడుకలకే పరిమితం చేయవద్దని ప్రధాని మోడీ అన్నారు. అమృత కాలం మరో 25ఏళ్ల దూరంలో ఉన్నదని వివరించారు. 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కాలానికి భారత్‌ను ఒక ఆదర్శవంతమైన దేశంగా, ఆత్మనిర్భరత దేశంగా నిర్మించాలని సూచించారు. ఇందుకు సబ్ కా సాత్, సబ్ కా వికాస్ సరిపోవని, అదనంగా సబ్ కా ప్రయాస్ అవసరమని తెలిపారు. సరికొత్త లక్ష్యాలను ఛేదించి నూతన భారతావనిని నిర్మించడానికి ప్రజలందరి కృషి అవసరమని అన్నారు.

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దేశానికి అమృతకాలం మరో 25ఏళ్లు దూరంలో ఉన్నదని అన్నారు. అప్పటి వరకు అందరూ ఖాళీగా వేచిచూడవద్దని తెలిపారు. దేశాభివృద్ధికి మార్పులు చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సరికొత్త భారతంలో జరుపుకోవడానికి అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మనిర్భరత సాధించడానికి, న్యూ ఇండియా నిర్మాణానికి సబ్ కా సాత్, సబ్ కా వికాస్‌, సబ్ కా విశ్వాస్ సరిపోవని, సబ్ కా ప్రయాస్ కూడా అవసరమని నొక్కి చెప్పారు. 

100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయానికి భారత్‌ను ఆదర్శవంతమైన దేశంగా తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమని వివరించారు. పరస్పర సహకారం, సమన్వయం, సుపరిపాలన, క్రమశిక్షణలు ఆదర్శ దేశాన్ని నిర్మించడానికి అవసరమని చెప్పారు. విశ్వగురువుగా భారత్ ఎదగడానికి ఇది అవసరమని చెప్పారు.

వేడుకలకు హాజరైన ఒలింపిక్ క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. టోక్యో ఒలింపిక్‌లో భారత ప్రజలను గర్వంగా నిలిపిన క్రీడాకారులు తమతో ఉన్నారని పేర్కొంటూ దేశమంతా వారిని గౌరవించాలని కోరారు. వారు కేవలం మన హృదయాలనే గెలుచుకోలేదని, భారత భావితరాలకు ప్రేరణ ఇచ్చారని వివరించారు.

కరోనా కాలంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికుల కృషి అసామాన్యమని ప్రధాని కీర్తించారు. ఈ పోరులో భారతపౌరులందరూ సహకరించారని, ఎంతో ఓర్పు, సహనంతో ఈ పోరాటం చేసినట్టు తెలిపారు. టీకాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పనిలేకుండా సైంటిస్టులు కృషి చేశారని, తద్వారా భారత్‌లో టీకాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. 

click me!