
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి కోసం పెద్ద నిర్ణయాలు, మార్పులు చేపట్టడానికి రాజకీయ సంకల్పం సమృద్ధిగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇదే పాలనలో సరికొత్త అధ్యాయానికి నాంది అని తెలిపారు. యావత్ ప్రపంచం భారతీయ సంకల్పాన్ని చూస్తున్నదని వివరించారు. సుపరిపాలన, స్మార్ట్ పరిపాలనలు సరికొత్త సంస్కరణలు తేవడానికి అవసరమని తెలిపారు. అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. అనేక చట్టపరమైన బంధనాలను తెంచేశామని వివరించారు. భారత ఇప్పుడు బృహత్ స్వప్నాన్ని చూస్తున్నదని, అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నదని అన్నారు. 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు.
గతంలో ప్రభుత్వం డ్రైవర్ సీట్‌లో కూర్చుండేదని, అప్పుడు దాని అవసరమున్నదేమో కానీ, ఇప్పుడు కాలం మారిందని ప్రధాని అన్నారు. అనవసరపు చట్టాలు, ప్రొసీజర్ల వల నుంచి ప్రజలను విముక్తి చేయాల్సిన అవసరాలు గత ఏడేళ్ల నుంచి పెరిగిందని వివరించారు. అందుకే అనవసరమైన నిబంధనలను చాలా వరకు ప్రభుత్వం ఎత్తేసిందని తెలిపారు. సేవలు చిట్టచివరి పౌరుడకీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశాన్ని సమూలంగా మార్చేసే నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతుందని అన్నారు. దేశ మౌలిక సదుపాయాలు, రవాణాల్లో సమగ్ర అభివృద్ధికి దారివేసే ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభిస్తామని వివరించారు. రూ. 100 కోట్ల ఈ ప్రాజెక్ట్ ఉపాధి కల్పన, సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. గతి శక్తి ప్రాజెక్ట్ దేశాభివృద్ధి అడ్డంకులను తొలగిస్తుందని వెల్లడించారు.
గతంలో భారత్ 8 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను దిగుమతి చేసిందని, నేడు మూడు బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తుందని వివరించారు. భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ శక్తిగా ఎదుగుతున్నదని తెలిపారు. ప్రపంచశ్రేణి ఉత్పత్తిదారుగా, అంతే నాణ్యతగల ఉత్పత్తులను అందించాలని సూచించారు.
చిన్న, సన్నకారు రైతులకు సదవకాశాలు కల్పించాల్సిన అవసరముందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. వారే దేశానికి ‘షాన్’ అని వెల్లడించారు.
బాలికలకూ సైనిక్ స్కూల్స్ ద్వారా తెరవాలని నిర్ణయించినట్టు ప్రధాని వెల్లడించారు. ఎంతోమంది బాలికలు తనకు లేఖలు రాసేవారని, తమకూ సైనిక్ స్కూల్స్ ప్రవేశానికి అనుమతించాలని అభ్యర్థించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్‌లలో బాలికలు ప్రవేశానికి నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
నూతన విద్యా విధానం స్థానిక భాషలో బోధనకు అవకాశం కల్పిస్తున్నదని, ఇది పేదరికం ఎక్కుపెట్టిన ఒక ఆయుధమని అభివర్ణించారు. క్రీడలను అందరూ ప్రోత్సహించాలని సూచించారు. 75వారాల అమృత్ మహోత్సవ్ కాలంలో దేశంలోని ప్రతిమూలను 75 వందే భారత్ ట్రైన్‌లు అనుసంధానిస్తాయని వివరించారు.