
మారిషస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి సర్ సీవుసాగూర్ రామ్గులం బొటానికల్ గార్డెన్‌లో మొక్కను నాటారు. 'అమ్మ పేరుతో ఒక మొక్క' అనే నినాదాన్ని ప్రధాని విదేశాలకు సైతం తీసుకెళ్లారు. గతంలో మోదీ గయానా పర్యటనలో భాగంగా కూడా ఇలాగే మొక్క నాటారు. దీంతో ఈ కార్యక్రమంపై మరోసారి అందరి దృష్టిపడింది. ఇంతకీ 'అమ్మ పేరుతో ఒక మొక్క' కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గతేడాది జూన్‌లో నిర్వహించిన మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ 'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమం గురించి వివరించారు. ‘‘మా అమ్మ పేరుతో నేను మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి ’’ అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. దీంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉద్యమంగా సాగింది.
ప్రధాని మోదీ పిలుపుతో ఇప్పటి వరకు భారత్‌లో ఏకంగా 100 కోట్ల మొక్కలను నాటారు. అయితే ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాకుండా, విదేశాలకు సైతం విస్తరించింది. ఇప్పటివరకు దాదాపు 136 దేశాల్లో 27,500 చెట్లకు పైగా నాటారు. వీటిలో రెండు దేశాల్లో ప్రధాని స్వయంగా మొక్కలను నాటి ఆ దేశ ప్రజలకు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ దిశగా ఒక గొప్ప మెరుగైన అడుగు వేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇదిలా ఉంటే రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం (మార్చి 11) ఉదయం మారిషస్ చేరుకున్నారు. మోదీకి ఆ దేశంలో అపూర్వ స్వాగతం లభించింది. మార్చి 12న జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మోదీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ దళాల బృందంతో పాటు భారత నావికాదళ నౌక కూడా పాల్గొంటుంది. తన రెండు రోజుల పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ భారతదేశం – మారిషస్ మధ్య సామర్థ్య నిర్మాణం, వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం వంటి రంగాలలో సహకారం కోసం అనేక ఒప్పందాలపై సంతకం చేయనున్నారు.