
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారంనాడు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్ లో జరిగే 15వ బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సమావేశంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఇవాళ్టి నుండి ఈ నెల 24వ తేదీ వరకు బ్రిక్స్ సమావేశాలు జరుగుతాయి.
ఈ సమావేశాలకు ముందుగా సమ్మిట్ హాజరయ్యే పలు దేశాధినేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. బ్రిక్స్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. సంస్కరణలు, గ్లోబల్ సౌత్ కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.ఈ శిఖరాగ్ర సమావేశం బ్రిక్స్ కు భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత కార్యక్రమాలపై సమీక్షకు దోహదపడుతుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
బ్రిక్స్ సమ్మిట్ లో భాగంగా నిర్వహించే బ్రిక్స్ ప్లస్ డైలాగ్ ఈవెంట్, బ్రిక్స్ ఆఫ్రికా ఔట్ రీచ్ లలో కూడ ప్రధాని మోడీ పాల్గొంటారు. దక్షిణాఫ్రికా నుండి ప్రధాని నరేంద్ర మోడీ గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ఏథెన్స్ కు వెళ్తారు. 40 ఏళ్ల తర్వాత గ్రీస్ ను సందర్శించే ప్రధానిగా మోడీకి గౌరవం దక్కింది.
రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయానికి తన గ్రీస్ పర్యటన దోహాదపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.రెండు నాగరికతల మధ్య సంబంధాలు ఏళ్లుగా విస్తరించాయని మోడీ చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ,సాంస్కృతిక ప్రజల మధ్య సంబంధాలు వంటి విభిన్న రంగాల్లో సహకారం రెండు దేశాలను మరింత దగ్గర చేయనుందని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.