
PM Modi US Visit: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White house) చేరుకున్న ప్రధానికి అపూర్వస్వాగతం లభించింది. ఇరుదేశాల జాతీయ గీతాలాపనలు, 19 తుపాకీల సెల్యూట్‌తో చాలా గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. భారతదేశం, అమెరికా మధ్య బంధం 21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన సంబంధమని అన్నారు. నేడు రెండు దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలే రానున్న తరాల భవిష్యత్తును నిర్దేశిస్తాయని అధ్యక్షుడు బిడెన్ అన్నారు. వైట్‌హౌస్‌లోకి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ.. అధ్యక్షుడు బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి నుండే ప్రధాని మోడీతో తనకు ప్రత్యేక అనుబంధముందని, తామిద్దరం చాలా సమయం గడిపామని తెలిపారు. నమ్మకం ఆధారంగా భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నామని, ప్రపంచ పరిస్థితి దృష్ట్యా భారత్-అమెరికా ఉమ్మడిగా ఉండడం అత్యంత అవశ్యకమని బైడెన్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల తలెత్తే సమస్యలపై భారతదేశం, అమెరికాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. భారత సహకారంతో తాము ఉచిత,బహిరంగ,సురక్షితమైన, సంపన్న ఇండో-పసిఫిక్ కోసం క్వాడ్‌ను బలోపేతం చేసామని ఆయన చెప్పారు. అంతకు ముందు వైట్ హౌస్ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో హాజరైన ఎన్ఆర్ఐల సమక్షంలో బిడెన్ మాట్లాడుతూ.. వైట్ హౌస్‌కి తిరిగి స్వాగతం ప్రధాని మోదీ. అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడ ఆతిథ్యమివ్వడం తాము గౌరవంగా భావిస్తున్నామని అన్నారు.
ఇది 140 కోట్ల మంది భారతీయుల గౌరవం: ప్రధాని మోదీ
అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. నేడు వైట్‌హౌస్‌లో గ్రాండ్ రిసెప్షన్ 140 కోట్ల మంది భారతీయులను గౌరవించే విధంగా ఉందని అన్నారు. అమెరికాలో నివసిస్తున్న దాదాపు 40 లక్షల మంది భారతీయ సంతతికి చెందిన వారికి ఇది గౌరవం కూడా. ఇందుకుగాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
రెండు దేశాలు ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయని, రెండు (దేశాలు) తమ వైవిధ్యం గురించి గర్వపడుతున్నాయని అన్నారు. ప్రపంచ మేలు, శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాలు కృషి చేస్తాయని, ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ప్రధాని అన్నారు. వైట్‌హౌస్‌లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతున్నాయి. అనంతరం .. అమెరికా చట్టసభ యూఎస్ కాంగ్రెస్‌లో (US Congress) ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.