నాలుగు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించాం..10 కోట్ల నకిలీ లబ్దిదారులను తొలగించాం: ప్రధాని మోదీ

By Sumanth Kanukula  |  First Published Nov 9, 2023, 4:45 PM IST

మధ్యప్రదేశ్‌లో ఓటర్ల ప్రతి ఓటుకు ‘‘త్రిశక్తి’’ శక్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాల్లో కోట్లాది మంది నకిలీ లబ్దిదారును సృష్టించిందని విమర్శించారు.


మధ్యప్రదేశ్‌లో ఓటర్ల ప్రతి ఓటుకు ‘‘త్రిశక్తి’’ శక్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాల్లో కోట్లాది మంది నకిలీ లబ్దిదారును సృష్టించిందని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాత్నాలో జరగిన బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పేదలకు నాలుగు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని.. అయితే తన కోసం ఒక్క ఇల్లు కూడా నిర్మించుకోలేదని అన్నారు. 

‘‘మీ ఒక్క ఓటు బీజేపీకి మళ్లీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. మీ ఓటు ఢిల్లీలో మోదీని బలపరుస్తుంది. అంతేకాకుండా అవినీతి కాంగ్రెస్‌ను మధ్యప్రదేశ్‌లో అధికారానికి వంద మైళ్ల దూరంలో ఉంచుతుంది. అంటే ఒక ఓటు, మూడు అద్భుతాలు. ఇది త్రిశక్తి లాంటిది’’ అని మోదీ అన్నారు.

Latest Videos

దేశంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్న కాంగ్రెస్ సృష్టించిన 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను రికార్డుల నుంచి తొలగించిందని ప్రధాని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ హామీలను నెరవేర్చడానికి ‘‘మోదీ హామీ’’ ఉందని ఆయన అన్నారు.

గత యూపీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నదని మోదీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నసమయంలో.. కేంద్రంలోని ప్రభుత్వం మధ్యప్రదేశ్ అభివృద్దికి అడుగడుగునా ఆటంకం కలిగించిందని అన్నారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలోని బీజేపీ పాలనకు డబుల్ ఇంజన్ శక్తి వచ్చిందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ అభివృద్ధిని కాంగ్రెస్ చీకటి బావిలో పడేసిందని.. బీజేపీ ప్రభుత్వం దాన్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిందని చెప్పారు.

ప్రతి పేదవాడు తన హక్కును పొందుతున్నాడని.. కాంగ్రెస్ అవినీతి పేదల సొంత గృహాల కలను నాశనం చేసిందని మోదీ విమర్శించారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రూ. 33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి పంపిందని.. ఇందులో ఒక్క రూపాయి కూడా దారి  మళ్లించలేదని మోదీ అన్నారు.

పేదల కోసం ఉద్దేశించిన సొమ్మును కాంగ్రెస్ ఎలా దోచుకుంటుందనడానికి వివిధ పథకాల నకిలీ లబ్ధిదారులు ప్రత్యక్ష ఉదాహరణలని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కాగితాలపై నకిలీ లబ్ధిదారులను సృష్టించిందని.. అది మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్‌ల మొత్తం జనాభాకు సమానమని సెటైర్లు వేశారు.  ఆయన అన్నారు.

“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబ్బు ఎక్కడికి పోతుందో ఎవరికీ తెలియదు. 2జీ, బొగ్గు, కామన్వెల్త్, హెలికాప్టర్ కుంభకోణాల్లో లక్షలు, కోట్లు వెళ్లాయి. ఈ స్కాములన్నింటిని మోదీ ఆపారు. కాంగ్రెస్ హయాంలో మధ్యవర్తులు సరదాగా గడిపేవారని.. అయితే మోదీ వారి దుకాణాలకు తాళాలు వేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం ప్రారంభించారు’’ అని మోదీ చెప్పారు. 

కాంగ్రెస్ ఖజానా నుంచి అసలు ఉనికిలో లేని వారి పేర్లపై డబ్బులు తీసుకుందని మోదీ ఆరోపించారు. ఈ డబ్బు కాంగ్రెస్, వారి మద్దతుదారులు, మధ్య దళారుల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు. అయితే కాంగ్రెస్ దురదృష్టం కారణంగా.. ప్రజలు 2014లో “చౌకీదార్” (సెక్యూరిటీ గార్డు)ని ఎన్నుకున్నారని.. అందువల్ల అటువంటి లబ్ధిదారులను తీసేయడం జరిగిందని.. 2.75 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయ్యిందని మోదీ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి మోదీ ప్రస్తావిస్తూ.. ‘‘ఈ రోజుల్లో నేను ఎక్కడికి వెళ్లినా అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించడం గురించి మాట్లాడుతున్నారు. దేశమంతటా ఆనందం వెల్లివిరిసింది. మనం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించినట్లే.. 30,000 పంచాయతీ భవనాలను కూడా నిర్మించాము. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల పేదలకు లక్షలాది ఇళ్లు కట్టిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి కావడం నాకు సంతోషంగా ఉంది. సాత్నాలో కూడా పేదలకు 1.32 లక్షల ఇళ్లు లభించాయి’’ అని మోదీ తెలిపారు.

కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రారంభించిన పేదల కోసం ఉచిత రేషన్ పథకాన్ని డిసెంబర్ తర్వాత వచ్చే ఐదేళ్ల పాటు పొడిగించాలని తాను సంకల్పించానని మోదీ చెప్పారు.

click me!