
అహ్మదాబాద్: మోడీ స్వరాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అక్కడ అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నట్టు తెలుస్తున్నది. అదే విధంగా అగ్ర నాయకులూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్‌లో అడుగు పెట్టారు. కాగా, ప్రధాని మోడీ ఒక్క రోజు రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోడీ పాటిదార్లు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సౌరాష్ట్ర రీజియన్‌లో పర్యటన చేస్తున్నారు. ఈ రీజియన్‌లోనే ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్‌కోట్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ, ఈ రోజు ఈ స్థాయికి రావడానికి గుజరాత్ ప్రజలే కారణం అని వివరించారు. గుజరాత్ ప్రజలే తనను నిర్మించారని తెలిపారు. ఆాయన ఈ రోజు రాజ్‌కోట్‌లో కేడీపీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ హాస్పిటల్ చారిటబుల్‌గా నడవనుంది. అంటే ఈ మల్టీ స్పెషాలిటీలో నామమాత్రపు చార్జీలకే చికిత్స అందించనున్నారు.
ప్రభుత్వ ఆశయాలకు ప్రజల ప్రయత్నాలూ తోడైతే దేశానికి సేవలు అందించడానికి తమ శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకు కేడీపీ హాస్పిటలే నిదర్శనం అని వివరించారు. తమ ప్రభుత్వ పేద ప్రజల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నదని తెలిపారు. జన్ ధన్ యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ది చేకూరుతున్నదని వివరించారు. కరోనా కాలంలోనూ అందరికీ ఉచితంగా టీకాలు అందించగలిగామని చెప్పారు. కర్షకులు, కార్మికులకు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్‌లో తాము నేరుగా డబ్బులు వేశామని తెలిపారు. పేదలకూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని పేర్కొన్నారు.
దేశానికి సేవ చేయడంలో ఎప్పుడూ రాజీ పడలేదని ప్రధాని అన్నారు.పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను వృద్ధిలోకి తేవడానికి తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. బాపు, సర్దార్ పటేల్ కలలుగన్న దేశ నిర్మాణం కోసం ఎనిమిదేళ్లుగా తాము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. పేదలు, దళితులు, బాధితులు, గిరిజనులు, మహిళలు పురోగి సాధించాలని మహాత్మా గాంధీ కలలు గన్నారని వివరించారు. అక్కడ పరిశుభ్రత, ఆరోగ్యం జీవితంలో భాగమై పోవాలని తెలిపారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలకు సొంతంగా, తనదైన సమాధానాన్ని వెతుక్కోవాలని వివరించారు.
తాను అవినీతి, వంశపారంపర్యట పాలనను అమలు జరపకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని వివరించారు. రాష్ట్రంలో సుమారు 30 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయనే విషయం తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుందని భావిస్తున్నట్టు ప్రధాని అన్నారు. గతంలో రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, అప్పుడు రాష్ట్రంలో మొత్తం కేవలం 1100 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ, ఇప్పుడు మరెన్నో మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశామని, ప్రస్తుతం రాష్ట్రంలో 30న ప్రభుత్వ ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని వివరించారు.
రాష్ట్రంలో పాటిదార్లు పది నుంచి 12 శాతం మేరకు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పాటిదార్ ఆందోళనలతో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని స్థానాలు తగ్గినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ సారి ముందస్తుగా పాటిదార్ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఈ ర్యాలీ వారి ప్రాబల్యం అధికంగానున్న రీజియన్‌లో మోడీ మాట్లాడినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.