టౌటే తుఫాన్ ఎఫెక్ట్: ముంబైని ముంచెత్తిన వానలు, కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో జోరు వర్షాలు

By narsimha lodeFirst Published May 17, 2021, 4:44 PM IST
Highlights

 టౌటే తుఫాన్ కారణంగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లాలోని  ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.  కొంకణ్ జిల్లాలో ఇద్దరు మరణించారు. 

ముంబై: టౌటే తుఫాన్ కారణంగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లాలోని  ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.  కొంకణ్ జిల్లాలో ఇద్దరు మరణించారు. ముంబైలో కూడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విమానాలను, రైళ్లను  అధికారులు నిలిపివేశారు. బాంద్రా- వర్లీ  మార్గాన్ని మూసివేశారు.  తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ మార్గాన్ని మూసివేస్తున్నట్టుగా బీఎంసీ సోమవారం నాడు ప్రకటించింది. 

తుఫాన్ తో పాటు ఈదురుగాలులతో పెద్ద ఎత్తున వృక్షాలు రోడ్లపైనే  కూలిపోయాయి. దీంతో రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇవాళ రాత్రి కూడ ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. ఈ తుఫాన్ కారణంగా సముద్రంలో అలలు  ఎగిసిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలను బయటకు రావొద్దని అధికారులు సూచించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో  సోమవారం నాడు ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రభుత్వం రంగంలోకి దించింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో టౌటే తుఫాన్ ప్రభావం కన్పిస్తోంది. ఈ జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉడుపినాడా ప్రాంతంలో 38.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  గోవాలో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో ఇద్దరు మరణించారు.  
 

click me!