మోడీ, జిన్‌పింగ్‌ల మధ్య డిస్టెన్స్.. కరచాలనం లేదు.. నవ్వులూ లేవు.. కారణం అదేనా?

By Mahesh KFirst Published Sep 16, 2022, 5:25 PM IST
Highlights

ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు డిస్టెన్స్ మెయింటెయిన్ చేసినట్టు తెలుస్తున్నది. వీరిద్దరు ఒకే వేదికపై నిలబడి ఫొటోకు ఫోజులిచ్చారు. కానీ, పక్క పక్కనే నిలబడినా కనీసం చిన్న స్మైల్ ఇచ్చుకోలేదు.. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు.
 

న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్, ఇతర దేశాల నేతలూ హాజరయ్యారు. అయితే, ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ డిస్టెన్స్ మెయింటెయిన్ చేశారు.

ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంతర్జాతీయ వేదికను పంచుకున్నారు. గాల్వన్ లోయలలో ఉభయ దేశాల మధ్య ఘర్షణలు ఏర్పడ్డ తొలిసారి ఈ ఇద్దరు నేతలు నేరుగా ఒక చోట చేరారు. రెండు సంవత్సరాల్లో వీరిద్దరు ఎదురుపడటం ఇదే తొలిసారి. కానీ, వారిద్దరూ ఒకరినొకరు చూసుకుని పలకరించుకోలేదు. కనీసం ఓ చిన్నపాటి స్మైల్ కూడా ఇచ్చుకోలేదు. షేక్ హ్యాండ్ లేనేలేదు. ఉభయ దేశాల నేతలూ ఒకే వేదికపై ఉన్నప్పటికీ కరచాలనం చేసుకోలేదు.

గురువారం సాయంత్రం ఈ సదస్సు హాజరయ్యే నేతలకు ప్రత్యేకంగా ఒక విందు ఏర్పాటు చేశారు. కానీ, ప్రధాని మోడీ ఈ విందుకు హాజరు కాలేదు. నేరుగా ఆయన శుక్రవారం ఉదయం వార్షిక సదస్సుకు హాజరయ్యారు.

గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సరిహద్దుల నుంచి ఉభయ దేశాల సైన్యం ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదు. పలుమార్లు భేటీలు జరుగుతున్నా ఏకాభిప్రాయం ఏర్పడకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తతలు తగ్గకపోవడంతోనే ఈ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

click me!