
న్యూఢిల్లీ:వచ్చే ఏడాది జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను కోరేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తామరంగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , తమిళనాడు సీఎం స్టాలిన్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే, ప్రధానమంత్రి హెచ్‌డి దేవేగౌడ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్ లున్నారు.
జీ 20 అధ్యక్ష పదవిని డిసెంబర్ 1వ తేదీన భారత్ అధికారికంగా స్వీకరించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 200కిపైగా సన్నాహక సమావేశాలకు దేశం అతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో రాష్ట్రాధినేతలు లేదా ప్రభుత్వాల స్థాయిలో జీ 20 లీడర్స్ సమ్మిట్ జరగనుంది.
ప్రపంచంలోని ప్రధాన అభివృద్ది చెందిన అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమే జీ-20. ఈ ఫోరంలో అర్జెంటీనా, అస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో,రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా,టర్కీ, యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్లు సభ్యులుగా ఉన్నాయి