
PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సోమవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. కేంద్ర మంత్రి మండలిలో పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన చర్చల మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, జి కిషన్ రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ..మంత్రిమండలి సమావేశం చాలా విజయవంతంగా జరిగిందని తెలిపారు. విధానపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకున్నాం ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే, ఈ కీలక భేటీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో కేబినెట్ భేటీ జరుగుతుండటంతో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ను కేబినేట్ లో తీసుకుంటారనే ఊహాగాహలు జోరందుకున్నాయి. అలాగే.. మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేంద్ర కేబినేట్ లోకి తీసుకొస్తారనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అంతకుముందు.. ప్రధాని మోదీ 2021లో చివరిసారిగా తన మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించారు. దీని తర్వాత ఆయన కొన్ని సందర్భాల్లో కొంతమంది మంత్రుల శాఖలను మార్చారు. 2021 కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రధాని మోడీ 36 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించగా, 12 మంది మంత్రులు డిశ్చార్జ్ అయ్యారు.
రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈసారి మంత్రి మండలి విస్తరణలో కొంత వారికి కేబినెట్ లో స్థానం ఇవ్వవచ్చు. దీనితో పాటు సంస్థ యొక్క కొన్ని ప్రముఖ ముఖాలను ప్రభుత్వంలో చేర్చుకోవచ్చు. దీనికి సంబంధించి బీజేపీలో పలు దఫాలుగా సమావేశాలు కూడా జరిగాయి. ఈ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ పాల్గొన్నారు.
అలాగే.. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందు.. కేంద్ర మంత్రి మండలిలో పునర్వ్యవస్థీకరణ చేయవచ్చనే ఊహాగానాలు బలపడ్డాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో పార్టీ అగ్రనాయకత్వం బిజీగా ఉన్నందున కొన్ని రాష్ట్రాలతో సహా బిజెపి కేంద్ర సంస్థలో కొన్ని మార్పులు కనిపించవచ్చని వర్గాలు తెలిపాయి. జూన్ 28న అమిత్ షా, జేపీ నడ్డాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి మండలిలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.