పాలస్తీనా ప్రెసిడెంట్‌కు ప్రధాని మోడీ ఫోన్.. ‘మా వైఖరి మారదు’

By Mahesh K  |  First Published Oct 19, 2023, 7:23 PM IST

పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమద్ అబ్బాస్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్ - పాలస్తీనా అంశంలో భారత్ సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న వైఖరినే అనుసరిస్తుందని పునరుద్ఘాటించారు.
 


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు హెచ్ఈ మొహమద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాజాలోని అల్ అహ్లి హాస్పిటల్ పై దాడిలో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పాలస్తీనా ప్రజలకు తమ సహకారం ఎప్పటిలాగే కొనసాగుతుందని వివరించారు.

ఈ విషయాన్ని గురువారం ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించారు. ‘పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు హెచ్ఈ మహమద్ అబ్బాస్‌తో మాట్లాడాను. గాజాలోని అల్ అహ్లి హాస్పిటల్‌లో మరణించిన పౌరులకు నా సంతాపాన్ని తెలిపాను. పాలస్తీనా ప్రజలకు మన సహకారాన్ని కొనసాగిస్తాం. తీవ్రవాదం, హింస, ఆ రీజియన్‌లో శాంతి భద్రతలు దిగజారిపోవడంపై ఆందోళనను తెలిపాను. ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై భారత్ తన సుదీర్ఘకాల వైఖరిని ఎప్పటిలాగే కొనసాగిస్తుంది’ అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనితో ఇజ్రాయెల్‌కు భారత్ ఏకపక్షంగా మద్దతు పలుకుతున్నదనే వాదనలకు తెరపడినట్టయింది. 

Latest Videos

హాస్పిటల్ పై దాడి జరిగి వందలాది మరణించిన ఘటనపై స్పందిస్తూ ప్రధాని మోడీ బుధవారం తీవ్ర ఆందోళనతో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.

Also Read: పాలస్తీనాపై కేంద్ర ప్రభుత్వ తొలి స్పందన.. స్వతంత్ర దేశ ఏర్పాటుకు మద్దతు: విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయ చట్టాల ప్రకారం హాస్పిటల్స్‌ను టార్గెట్ చేయరాదు. కానీ, గాజాలో హాస్పిటల్ పై బాంబు పడింది. వందలాది మంది మరణించారు. ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా దేశాల అధినేతలు ఖండించారు. ఇజ్రాయెల్ ఈ బాంబులు వేసిందని హమాస్ ఆరోపించింది. కాగా, హమాస్ వాదనలను ఇజ్రాయెల్ ఖండించింది.

అమెరికా మాత్రం ఓ అడుగు ముందుకు వేసి ఇజ్రాయెల్ ఆ బాంబు వేయలేదని, హమాస్ వేసి ఉండొచ్చని, అది ఉద్దేశ్యపూర్వకంగా వేసి ఉండకపోవచ్చని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 12వ తేదీన కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడారు.  ‘మా వైఖరి సుదీర్ఘమైనది, సుస్థిరమైనది. స్వతంత్ర, సార్వభౌమ, సుస్థిరంగా నిలబడేలా పాలస్తీనా దేశ స్థాపన కోసం ప్రత్యక్ష సంప్రదింపులను భారత్ కోరుకుంటుంది. ఇజ్రాయెల్‌తో సరిహద్దును పంచుకుంటూనే సుస్థిరంగా, సురక్షితంగా జీవించేలా ఆ దేశం ఉండాలని, ఇజ్రాయెల్‌తో పొరుగునే శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నది. ఎప్పటిలాగే ఈ భారత వైఖరిలో మార్పు లేదు’ అని అరిందమ్ బాగ్చి తెలిపారు.

click me!