
చండీగడ్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) కాంగ్రెస్(Congress) సీనియర్ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై కౌంటర్ వేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తూ ప్రియాంక గాంధీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై విమర్శలు సంధించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు పంజాబ్(Punjab) ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీ చెప్పుచేతల్లో నడిచిందని ఆరోపించారు. తాజాగా, ఈ ఆరోపణలకు ప్రధాని మోడీ ప్రతిజవాబు ఇచ్చారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వ నిర్వహణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటంకాలు సృష్టించిందని అన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌నూ అవమానించిందని పేర్కొన్నారు. ఒక రిమోట్ కంట్రోల్ విధానంలో పంజాబ్ ప్రభుత్వాన్ని నడిపిందని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పంజాబ్‌లో పర్యటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో మాట్లాడారు. జలంధర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి భద్రతా వైఫల్యం ఎదురైన తర్వాత తొలిసారిగా ఆయన మళ్లీ పంజాబ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జలంధర్‌లో మాట్లాడుతూ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నడిపిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వాన్ని నడపడం వారికి ఇష్టం లేదని పేర్కొన్నట్టు గుర్తు చేశారు. అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒకే ఒక కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్‌గా పని చేస్తున్నాయని తేటతెల్లం అయింది కదా అని ఆరోపించారు.
ఒక వేళ కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. కేంద్రంతో సహకరించినంత మాత్రానా.. ఆయన భారత సమాఖ్య స్ఫూర్తిని దాటినట్టా? అని నిలదీశారు. కెప్టెన్ తమ మాటలను వినేవాడు కాదని, కేవలం కేంద్ర ప్రభుత్వం మాటలే వినేవారని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు సృష్టించిందని, చివరకు ఆయనను సీఎం పదవి నుంచి తొలగించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన తప్పిదాలకు మూల్యం చెల్లించుకుంటున్నదని ప్రధాని మోడీ అన్నారు. ఆ పార్టీలో అంతర్గత పోరును చూస్తే అర్థం అవుతుందని ఆ పార్టీ ఎంతగా దిగజారిందో చెప్పడానికి అని విమర్శించారు. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ దుస్థితిని వెల్లడిస్తున్నారని వివరించారు. ఒక పార్టీనే వార కంట్రోల్ చేయలేకపోతున్నారని, అలాంటి వారు సుస్థిర ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరని ప్రశ్నించారు. పంజాబ్‌లో బీజేపీ, కెప్టెన్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్)లు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జరుగుతోన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉందనీ, ఈసారి ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని కెప్టెన్ అమరీందర్ సింగ్ జోస్యం చెప్పారు. పీఎల్‌సీ-బీజేపీ-సాద్ (సంయుక్త్) కూటమి పుంజుకుంటోందని చెప్పారు. పంజాబ్‌లో ప్రస్తుతం చతుర్ముఖ లేదా పంచముఖ పోటీ ఉందని, ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారని అన్నారు.బహుముఖ పోటీ వల్ల.. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదనీ, దీంతో పరిస్థితి క్లిష్టంగా మారుతోందని అన్నారు. ఒక్కో పార్టీకి 10 నుంచి 15 సీట్లు దాటే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చుననీ, ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అనుకోవడం లేదనీ అన్నారు.