పేద ప్రజల కోసం ఆయుష్మాన్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

By ramya neerukondaFirst Published Aug 15, 2018, 9:12 AM IST
Highlights

ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. దీనివల్ల 10 కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం మీద 50 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు.

72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ప్రధాని నరేంద్రమోదీ పేద ప్రజల కోసం ఒక గొప్ప పథకాన్ని ప్రకటించారు. దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.

దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై 72వ స్వాత్రంత్య వేడుకలు ప్రారంభించిన మోదీ.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో భాగంగానే..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ పథకాన్ని మోదీ ప్రకటించారు.సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశంలోని పేదలందరికీ ఉచిత వైద్య సాయం అందిస్తామన్నారు. తొలి విడతలో 10కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రోగమొస్తే ఏం చేయాలన్న భయం పేదల్లో ఉండకూడదని మోదీ అన్నారు. ఇంట్లో ఒకరికి రోగమొస్తే కుటుంబమంతా దిక్కతోచని స్థితిలోకి వెళ్తుందని.. అలాంటివారందరికీ ఈ పథకం భరోసా ఇస్తుందన్నారు.ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. దీనివల్ల 10 కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం మీద 50 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు.

click me!