
న్యూఢిల్లీ: 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..నగరాల్లో సొంత ఇంటిపై కలలు కనే వారికి బ్యాంకు రుణాల్లో కొంత ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో ఓ పథకాన్ని ప్రారంభించనుందని ప్రకటించారు. తమ ప్రభుత్వం నగరాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు లేని ఈ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తుందని చెప్పారు. అలాంటి వారికి హౌస్ లోన్ వడ్డీలో రూ. లక్షల్లో ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టుగా చెప్పారు.
‘‘నగరంలో నివసిస్తూ సొంత ఇంటి కలలు కంటున్న బలహీన ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు రాబోయే కొన్నేళ్లలో వారి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అద్దె ఇళ్లు, మురికివాడల్లో నివాసం ఉంటున్న వారు, చాలీచాలని జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి వచ్చే గృహ రుణాల వడ్డీలో రూ. లక్షల్లో ఉపశమనం కల్పించాలని నిర్ణయించాం. దేశంలోని అధిక జనాభా ఇప్పటికీ మురికివాడల్లోనే నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభాలో 17 శాతం మంది మురికివాడల్లో నివసిస్తున్నారు’’ అని మోదీ అన్నారు.
ఇక, ప్రధాన మంత్రి మోదీ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (PMAY-U)ను 2015 జూన్ 25న ప్రారంభించారు. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ PMAY-U పథకాన్ని అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ సంవత్సరం జూలై 31 వరకు PMAY (అర్బన్) కింద సుమారు 1.18 కోట్ల గృహాలు మంజూరు చేయబడ్డాయి.