
న్యూఢిల్లీ: 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు కేంద్ర మంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వంటి ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఈ వేడుకలకు గైర్హాజరు కావడం విశేషం.
Also Read: భారత్ ‘‘విశ్వ మిత్ర’’గా ఉద్భవించింది.. ఆ మూడు చెడులను వదిలించుకోవాలి: ఎర్రకోట వద్ద మోదీ ప్రసంగం
అయితే భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటిగా జరుపుకునే ఈ కార్యక్రమానికి ప్రజా జీవితంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. ఎర్రకోట వద్ద జాతీయ జెండా రెపరెపలాడుతుండగా.. మల్లికార్జున్ ఖర్గే కోసం రిజర్వు చేసిన కుర్చీ ఖాళీగా ఉండిపోయింది. అయితే ఊహించని విధంగా ఖర్గే గైర్హాజరు కావడానికి గల కారణాలపై ఊహాగానాలు చెలరేగాయి. ఇక, ఖర్గే గత ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించిన తర్వాత జరిగిన తొలి స్వాతంత్ర్య దినోత్సవం కావడం.. ఆయన ఎర్రకోట వద్ద వేడుకలకు గైర్హాజరు కావడం గమనార్హం. ఇదిలాఉంటే, ఖర్గే హాజరు కాకపోవడానికి గల కారణానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక, ట్విట్టర్ వేదికగా మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మన దేశానికి ఆత్మ. దేశం ఐక్యత, సమగ్రత కోసం, ప్రేమ, సోదరభావం కోసం, సామరస్యం కోసం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం స్వేచ్ఛను మేము సమర్థిస్తాము అని మేము ఈ ప్రమాణం చేస్తున్నాము’’ అని ఖర్గే పేర్కొన్నారు.