
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు చిక్కుకున్నారు. తమను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రిషికేష్ కు 40 కి.మీ దూరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ కొడియాల వద్ద చిక్కుకున్నట్టుగా తెలుగు యాత్రికులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుండి బెంగుళూరు నుండి ఉత్తరాఖండ్ కు వెళ్లిన యాత్రికులు కొడియాల వద్ద చిక్కుకున్నారు. సుమారు 1500 వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. సుమారు 20 వేల మంది రోడ్డుపైనే ఉన్నారు.
భారీ వర్షాలతో తరచుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడం సహజమే. గతంలో కూడ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ 23న కూడ కొండచరియలు విరిగిపడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో రోడ్డుపైనే వందలాది వాహనాలు నిలిచిపోయి యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
ఈ ఏడాది జూలై 12న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తొమ్మిది మంది యాత్రికులు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. రిషికేష్ వద్ద గంగా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహించింది. భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ వద్ద 100 మంది చిక్కుకున్నారు.