వచ్చే నెల నుంచి సుప్రీంకోర్టు ఫిజికల్ హియరింగ్స్.. వర్చువల్ కూడా అందుబాటులోనే

By telugu teamFirst Published Aug 29, 2021, 3:17 PM IST
Highlights

సుప్రీంకోర్టు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించనుంది. అలాగే, ప్రస్తుత వర్చువల్ మోడ్ విచారణ కూడా కొనసాగించనుంది. ఫిజికల్ హియరింగ్ కోసం ఇప్పటికే మార్గదర్శకాలను సుప్రీంకోర్టు నోటిఫై చేసింది. ఫిజికల్ లేదా వర్చువల్ మోడ్‌లను ఎంచుకునే అవకాశాన్ని అడ్వకేట్ ఆన్ రికార్డు లేదా పిటిషనర్ ఇన్ పర్సన్‌లకే ఇచ్చింది. ఒకసారి ఫిజికల్ హియరింగ్ ఎంచుకున్నవారికి మళ్లీ వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ మోడ్‌లో విచారణకు అవకాశం ఉండదు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభించడంతో ఆన్‌లైన్ విచారణ చేపడుతున్న అత్యున్నత న్యాయస్థానం వచ్చే నెల నుంచి మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నోటిఫై చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఫిజికల్ హియరింగ్ ప్రారంభించనుంది.

క్రమంగా ఫిజికల్ హియరింగ్ మళ్లీ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ముందుగా తుది దశకు చేరుకున్న కేసులు, నాన్ మిసలేనియస్ డేస్‌లో విచారించే కేసులనే ఫిజికల్ హియరింగ్ టేకప్ చేయనున్నట్టు వివరించారు. అయితే, అన్ని కేసులకూ ఫిజికల్‌తోపాటు వర్చువల్ హియరింగ్‌కు అవకాశం ఉంటుంది. ఆన్ రికార్డు అడ్వకేట్లు తమ చాయిస్ ఎంచుకోవాలని, ఒకసారి ఫిజికల్ హియరింగ్ ఎంచుకున్న తర్వాత మళ్లీ వర్చువల్ హియరింగ్‌కు అవకాశముండదని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.

వారం రోజులపాటు జరిగే రెగ్యులర్ లేదా ఫైనల్ హియరింగ్‌ల జాబితాను సుప్రీంకోర్టు ప్రచురించిన 24 గంటల్లోనే ఆన్ రికార్డు అడ్వకేట్లు తమ ప్రాధమ్యాలను కోర్టు పోర్టల్‌లోకి వెళ్లి ఎంచుకోవాలని కోర్టు సూచించింది. ఫిజికల్ హియరింగ్ లేదా వర్చువల్ హియరింగ్‌లో కేసు విచారణ జరగాలని కోరుకుంటున్నారో స్పష్టపరచాలని తెలిపింది. ఫిజికల్ హియరింగ్‌కు లిస్ట్ అయిన కేసు విచారణకు ఒక ఆన్ రికార్డ్ అడ్వకేట్ లేదా ఆయన నామినీ, ఒక ఆర్గ్యూయింగ్ కౌన్సెల్, పార్టీకి ఒక జూనియర్ కౌన్సెల్, రిజిస్టర్డ్ క్లర్క్‌లను కోర్టు రూమ్‌లోకి అనుమతి ఉంటుందని తెలిపింది. ఒకసారి ఫిజికల్ హియరింగ్‌ను ఆన్ రికార్డు అడ్వకేట్ లేదా పిటిషనర్ ఇన్‌పర్సన్ ఎంచుకున్న తర్వాత వారికి మళ్లీ వీడియో లేదా టెలీ కాన్ఫరెన్సింగ్ మోడ్‌లో విచారణకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

click me!