కేరళలో వింత.. శవంతో నవ్వుతూ, తుళ్ళుతూ ఫ్యామిలీ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్..

By Bukka SumabalaFirst Published Aug 25, 2022, 10:48 AM IST
Highlights

కేరళలో ఓ కుటుంబం చనిపోయిన తమ కుటుంబపెద్దతో కలిసి నవ్వుతూ గ్రూప్ ఫొటో దిగారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి కూడా వీరిని సమర్థించారు. 

కేరళ : కేరళలో జరిగిన ఓ అంత్యక్రియలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం ఏమిటో తెలిస్తే మీరూ ముక్కుమీద వేలేసుకుంటారు. ఆశ్చర్యపోతారు. వారు చెప్పే కారణం వింటే.. ఒక్కసారి ఆలోచనలో పడతారు.. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే... కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయిన ఓ బామ్మ శవ పేటిక చుట్టూ నిల్చుని.. నవ్వుతూ, సంతోషంగా పోజులివ్వడం కనిపిస్తుంది. వివరాల ప్రకారం, గత వారం 95 ఏళ్ల మరియమ్మ అనే బామ్మ చనిపోయింది.

ఆగస్ట్ 17న ఆమె మరణించారు. ఆమె అంత్యక్రియలు జరపడానికి ముందు.. పతనతిట్ట జిల్లాలోని మాలపల్లి గ్రామంలో ఆమె కుటుంబసభ్యులంతా కలిసి ఓ ఫోటో దిగారు. ఈ ఫ్యామిలీ ఫొటో కోసం శవపేటిక చుట్టూ దాదాపు 40 మంది కుటుంబ సభ్యులు హాయిగా నవ్వుతూ.. కూర్చుని, నిలబడి ఫొటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చర్చనీయాంశంగా మారింది. కేరళ మంత్రి వి సిన్వాన్‌కుట్టి కూడా కామెంట్ చేశారు. 

ఒకే కుటుంబంలో 11మందిని కాటేసిన పాము.. ఐదుగురు మృతి..!

చనిపోయిన మరియమ్మకు 95 సంవత్సరాలు.. సంవత్సరకాలంగా అనారోగ్యంతో మంచపట్టింది. గత కొన్ని వారాలుగా ఆమె పరిస్థితి మరింత దిగజారింది, ఆమెకు తొమ్మిది మంది పిల్లలు. 19 మంది మనుమలు, మునిమనుమలు, మనవరాళ్లు ఉన్నారు. వీరంతా వివిధ దేశాల్లో ఉన్నవారే. అయితే ఆమె చనిపోవడంతో వీరంతా ఇంటికి వచ్చారు. అలా కలవడం అరుదుగా జరుగుతుందట. అంతేకాదు మరియమ్మ అంటే కుటుంబంలో అందరినీ ఎంతో ప్రేమ అట. ఆమె 95 సంవత్సరాలు సంపూర్ణ జీవితాన్ని జీవించి.. హాయిగా కన్నుమూసింది. దీన్ని ఒక విషాదంగా చేసుకోకూడదనుకున్నారట. అందుకే అలా ఫొటో దిగాం అని బంధువు ఒకరు తెలిపారు.

అయితే, ఆ ఫొటో ఇలా వైరల్ అవుతుందని వారు అనుకోలేదట. మరియమ్మ 95 ఏళ్లు సంతోషంగా జీవించిందని, తన పిల్లలు, మనవళ్లందరినీ ప్రేమగా చూసుకుందని బంధువు బాబు ఉమ్మన్ తెలిపారు. కుటుంబం ఆమెతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకోవడానికి ఈ ఫోటో తీశానని చెప్పాడు. శుక్రవారం తెల్లవారుజామున 2.15 గంటలకు అంత్యక్రియల ప్రార్థనలు ముగిసిన వెంటనే ఫోటో తీసినట్టు తెలుస్తోంది. ఫోటో తీసి భద్రపరచుకోవాలన్నది ఆ కుటుంబ సభ్యుల కోరిక.

ఈ ఫొటో వెనకున్న ఉద్దేశాన్ని గుర్తించేని వారికి ఇది తప్పుగా కనిపిస్తుంది. మరణం అంటే కన్నీళ్లు మాత్రమే కాదు.. మరణించిన వారికి ఏడుస్తూ కాకుండా సంతోషంగా వీడ్కోలు పలకాలి. మేము కూడా అదే చేసాం" అని మరొక కుటుంబ సభ్యుడు చెప్పారు. అందుకే తమ మీద విరుచుకుపడుతున్న వారిమీద తమకేం కోపం లేదని.. తాము ఎవరిపైనా ఫిర్యాదు చేబోవడం లేదని అన్నారు. 

కాగా, కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి కుటుంబానికి మద్దతుగా మాట్లాడారు. మరణం బాధాకరం.. కానీ అది కూడా వీడ్కోలు.. ఆనందంగా జీవించిన వారికి చిరునవ్వుతో వీడ్కోలు ఇవ్వడం కంటే సంతోషం ఏముంటుంది.. ఈ ఫొటోకు నెగెటివ్ కామెంట్స్ అవసరం లేదు’’ అని ఫేస్ బుక్ లో అన్నారు. ఫేస్‌బుక్‌లో ఈ ఫొటో మీద రకరకాల కామెంట్స్ వెల్లువెత్తాయి. కొంతమంది చచ్చిపోతే ఇలా సరదాగా గడిపారంటూ తప్పుపడితే.. మరికొందరు ఫోటోలో తప్పు లేదంటూ సమర్థించారు.

click me!