నా భార్య, కూతురిని హత్తుకోవాలనిపించింది కానీ.. వలస కూలీ ఆవేదన

By telugu news teamFirst Published May 19, 2020, 11:38 AM IST
Highlights

ఇటీవల కొడుకు మరణ వార్త విని ఓ వలస కార్మికుడు రోడ్డుపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో ఒకటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ వలస కార్మికుడు ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. 

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా వైరస్ మాట దేవుడెరుగు.. వలస కార్మికులు మాత్రం నానా కష్టాలు పడ్డారు. తినడానికి తిండిలేక.. చేసుకోవడానికి పనిలేక.. సొంత గూటికి చేరడానికి రవాణ సదుపాయం లేక వారు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ కాలి నడకన ఇళ్లను చేరేందుకు కొందరు వలస  కార్మికులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఇటీవల కొడుకు మరణ వార్త విని ఓ వలస కార్మికుడు రోడ్డుపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో ఒకటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ వలస కార్మికుడు ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. ఢిల్లీ లో ఉన్న ఆ వలస కార్మికుడిని బిహార్ లోని అతని భార్య, కూతురి వద్దకు అధికారులు పంపించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశంలో లాక్ డౌన్ విధించగానే.. వలస కార్మికుడు రామ్ పుకర్ ఫండిట్(38) అనే వలస కూలీ ఢిల్లీ నుంచి స్వగ్రామమైన బిహార్ లోని బెగుసరాయ్ కి వెళ్లడానికి బయలు దేరాడు. అతను కాలి నడకన తన ప్రయాణం ప్రారంభించగా.. దారిలో తన కొడుకు చనిపోయాడనే వార్త వినాల్సి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే అతని భార్య బిడ్డకు జన్మనివ్వగా.. ఆ బిడ్డను తాను కళ్లారా చూసుకోకముందే ఆ పసికందు ప్రాణాలు వదిలాడు.

ఆ వార్త అతని చెవిన పడటంతో.. రోడ్డుపైనే కూర్చొని గుండెలు అవిసేలా ఆ వలస కార్మికుడు రోదించాడు. కాగా.. అతను అలా ఏడుస్తుండగా తీసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అధికారులు స్పందించి.. అతనిని శ్రామిక్ రైలులో స్వగ్రామానికి తరలించారు. 

ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా అతనిని ఇంటికి పంపించకుండా.. క్వారంటైన్ కి తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. తాను కళ్లు తిరిగి పడిపోయానని.. ఎవరో కారులో తీసుకువెళ్లి వైద్యం అందించారని అతను కోలుకున్నాక చెప్పాడు. వాళ్లు తనకు పరీక్షలు కూడా చేశారని.. ఫలితం ఇంకా రాలేదని చెప్పాడు.

ప్రస్తుతం అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆస్పత్రిలో ఉంచగా.. దూరం నుంచే భార్య, కూతురిని చూశానని చెప్పాడు. తన భార్య, కూతురిని గుండెలకు హత్తుకోవాలని తనకు అనిపిందని కానీ.. అది మంచిది కాదని వైద్యులు చెప్పారని అన్నారు.

click me!