Petrol Price cut: లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ. 8 తగ్గించిన ప్రభుత్వం.. వాహనదారులకు పండగే.. ఎక్కడంటే..

By team teluguFirst Published Dec 1, 2021, 1:29 PM IST
Highlights

నెల రోజుల కిందట కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాలు అదే బాటలో ప్రయాణించాయి. అయితే మిగిలిన రాష్ట్రాలు కూడా రాష్ట్రాల్లో ఇంధన ధరలపై ఉన్న వ్యాట్‌ను తగ్గించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 

నెల రోజుల కిందట కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలన తగ్గించిన సంగతి తెలిసిందే. లీటరు పెట్రోల్‌‌పై రూ. 5, లీటర్​ డీజిల్‌‌పై  రూ. 10 చొప్పున ఎక్సైజ్​ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు, మరికొన్ని రాష్ట్రాలు అదే బాటలో నడిచాయి. తమ రాష్ట్రాల్లో మరింతగా ధరలను తగ్గించాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన రాష్ట్రాల్లో ఇంధన ధరలపై ఉన్న వ్యాట్‌ను (VAT) తగ్గించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

పెట్రోల్‌పై వ్యాట్‌(విలువ ఆధారిత పన్ను)ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అధ్యక్షతన సమావేశం అయిన మంత్రి మండలి (Delhi cabinet) నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ (Delhi Petrol Price cut) ధర రూ. 8 తగ్గింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96కు దిగి రానుంది. కొత్త ధరలు నేటి అర్దరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఇక, ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97, లీటర్ డీజిల్ ధర రూ. 86.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 109.98, డీజిల్ రూ. 94.14గా ఉంది. అయితే  వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న వ్యాట్ ఆధారంగా ఇంధన ధరల్లో మార్పులు ఉంటాయనే సంగతి తెలిసిందే. 

ఇక, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు.. అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయనే సంగతి తెలిసిందే. 

click me!