
Karnataka: వివిధ రాష్ట్రాల ప్రజలు ఒకరితో ఒకరు సంభాషించుకునేటప్పుడు ఇంగ్లీషు కాకుండా హిందీని ఉపయోగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మరుసటి రోజు.. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం తమ వ్యక్తిగత ఎజెండాను బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. "కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి తమ వ్యక్తిగత ఎజెండాలను బలవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అవి విజయవంతం కావు. ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు" అని కుమారస్వామి చెప్పారు.
కేంద్రంతో పాటు కర్నాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హిందీని.. స్థానిక భాషలో స్థానంలో తీసుకువచ్చేందుకు కుట్రకు తెరదీసిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో కూడా, దక్షిణాది రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం హిందీకి అనుకూలంగా ముండుకు సాగుతూ రాష్ట్ర అధికార భాష కన్నడను పక్కన పెడుతున్నదని కుమారస్వామి ఆరోపించారు. ఇదిలావుండగా, హిందీ భాషను బలవంతంగా రుద్దేందు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని గత కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కర్నాటక, తమిళనాడు సహా పలు దక్షిణాది రాష్ట్రాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. IT హబ్ బెంగళూరులో మెట్రో సైన్ బోర్డులపై భాషను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కూడా జరిగాయి. భారతదేశానికి అధికారిక భాష లేదు. కానీ రాజ్యంగం గుర్తించిన భాషలు కొన్ని ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో అమిత్ షా ప్రసంగిస్తూ 'ఇప్పుడు అధికార భాష హిందీని జాతీయ ఐక్యతలో ముఖ్యమైన భాగం చేయాల్సిన సమయం ఆసన్నమైంది' అని చెప్పడంతో మళ్లీ భాషా వివాదం తెరమీదకు వచ్చింది. షా మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నిర్వహించే మాధ్యమం అధికార భాష అని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారని, ఇది కచ్చితంగా హిందీకి ప్రాముఖ్యతను పెంచుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కేబినెట్‌లోని 70 శాతం ఎజెండా హిందీలో సిద్ధమైందని సభ్యులకు తెలియజేశారు. దేశ ఐక్యతలో అధికార భాష హిందీని ముఖ్యమైన భాగంగా చేయాల్సిన సమయం ఆసన్నమైందని షా అన్నారు. స్థానిక భాషలను కాకుండా ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని ఆయన అన్నారు. ఇతర స్థానిక భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైనదిగా మారుస్తారే తప్ప ప్రచారం చేయరాదన్నారు. వివిధ భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు అది ‘భారతీయ భాష’లోనే ఉండాలని హోం మంత్రి అన్నారు.