వార్ రూమ్ లో సీట్ల సర్ధుబాటు తేలలేదు...ఇంకా చర్చ జరగాలి: ఉత్తమ్

By Nagaraju TFirst Published Sep 25, 2018, 9:06 PM IST
Highlights

పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. ఇదే అంశంపై చర్చించేందుకు వార్‌ రూమ్‌లో కాంగ్రెస్ సీనియర్‌ నేతలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ఆంటోనీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పాల్గొన్నారు. 

ఢిల్లీ: పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. ఇదే అంశంపై చర్చించేందుకు వార్‌ రూమ్‌లో కాంగ్రెస్ సీనియర్‌ నేతలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ఆంటోనీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పాల్గొన్నారు. 

మహాకూటమిలో సీట్ల కేటాయింపులకు సంబంధించి చర్చించారు. టీడీపీ-10 సీట్లు, టీజేఎస్‌- 3, సీపీఐ-3 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే టీడీపీ19 సీట్లు కావాలని పట్టుబడుతుండటంతో వార్ రూమ్ లో వాడివేడిగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే పలు స్థానాల్లో ప్రచారం మెుదలుపెట్టారని ఆయా స్థానాలపై టీడీపీ కూడా పట్టుబడుతోందని వార్ రూమ్ లో చర్చించారు. అలాగే సీపీఐ, టీజేఎస్ పార్టీల డిమాండ్ లు సైతం చర్చకొచ్చింది.  

మరోవైపు మాజీమంత్రి కొండా సురేఖ దంపతుల చేరికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ దంపతులు పార్టీలో చేరితే జరిగే పరిణామాలపై చర్చించారు. అలాగే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేవాళ్లపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు సర్ధుబాటు, అభ్యర్థుల ప్రకటనలపై చర్చించినట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా స్పష్టం చేశారు. అయితే పొత్తులు, సీట్లు సర్ధుబాటుపై ఓ కొలిక్కిరావాల్సి ఉందన్నారు. మరోవైపు సీట్ల సర్ధుబాట్లపై లోతైన చర్చ జరగాల్సి ఉందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇకపోతే మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఏర్పడింది. టీడీపీ గ్రేటర్‌లోనే అత్యధిక స్థానాలు కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అందుకు ససేమిరా అంటోంది. దీంతో ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకంపై ఓ కొలిక్కిరాకపోవడంతో పలు సీట్లపై ప్రతిష్టంభన ఏర్పడింది. సత్తుపల్లి, దేవరకద్ర, మక్తల్, ఉప్పల్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ముషీరాబాద్, నర్సంపేట, బాల్కొండ స్థానాలపై ప్రతిష్టంభన ఏర్పడింది.

అయితే సీట్ల కేటాయింపు ఫైనల్ కాకుండానే కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే తమ ప్రచారాన్ని ప్రారంభించారు. ఖైరతాబాద్ నుంచి సినీ నిర్మాత డాక్టర్ రోహిన్ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి భిక్షపతియాదవ్, కుత్బుల్లాపూర్‌ నుంచి కూన శ్రీశైలం గౌడ్, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, జూబ్లీహిల్స్‌ నుంచి విష్ణువర్దన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. 

అయితే ఈ స్థానాలనే టీడీపీ కోరుతోంది. అయితే ఈ స్థానాలకు బదులు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. అటు సీపీఐ ఆశిస్తున్న కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు నియోజకవర్గాలపైనా ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ఈ స్థానాల్లోనూ కాంగ్రెస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. 

కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, హుస్నాబాద్‌లో ప్రవీణ్ రెడ్డి, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ప్రాచారంలో మునిగిపోయారు. దీంతో బెల్లంపల్లి, వైరా స్థానాలు సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. 

మెుత్తానికి సీట్ల సర్ధుబాటు వ్యవహారంపై ఇంకా ఓ కొలిక్కిరాకపోవడం, పార్టీ ప్రకటించకుండానే కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండటం కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. అయితే అక్టోబర్ 4న స్క్రీనింగ్ కమిటీ పర్యటన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

click me!
Last Updated Sep 26, 2018, 2:21 PM IST
click me!