
పాట్నా: కరోనా మహమ్మారి మన దేశంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కోర్టు కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ఆటంకాలను అధిగమించడానికి వర్చువల్ హియరింగ్‌ను సుప్రీంకోర్టు ముందుకు తెచ్చింది. హైబ్రీడ్ ఆన్‌లైన్ యాక్సెస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కోర్టు హియరింగ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా, వైరల్ అవుతున్న ఓ వీడియో క్లిప్‌లో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ఐఏఎస్ అధికారిపై మండిపడ్డారు. కోర్టులో ఎలాంటి డ్రెస్ వేసుకుని రావాలో తెలియదా అంటూ బిహార్ రాష్ట్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆనంద్ కిశోర్‌పై ఫైర్ అయ్యారు. సుమారు రెండు నిమిషాలపాటు ఆయనపై ఆగ్రహంగా వ్యాఖ్యలు చేశారు. ఇదేమైనా సినిమా హాల్ అనుకుంటున్నావా? అంటూ ఫైర్ ఆగ్రహించారు.
ఐఏఎస్ ఆఫీసర్ ఆనంద్ కిశోర్ పాట్నా హైకోర్టులోకి ఓపెన్ కాలర్‌తో వైట్ షర్ట్ వేసుకుని వచ్చాడు. ఆయన డ్రెస్సింగ్ చూసి పాట్నా హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. కోర్టులో ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలో తెలియదా? అంటూ ఆగ్రహించారు. కోర్టులో ఎలా బిహేవ్ చేయాలో ఐఏఎస్ ట్రైనింగ్‌లో బోధించలేదా? అని అడిగారు. మిస్సోరిలోని ఐఏఎస్ ట్రైనింగ్ స్కూల్‌కు వెళ్లలేదా? అని ప్రశ్నించారు.
ఎలాంటి డ్రెస్ వేసుకుని వచ్చారు? అసలు బిహార్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు ఏమైంది? అని అన్నారు. వారికి కోర్టులో ఎలా అప్పియర్ కావాలో తెలియదా? అని ప్రశ్నించారు. ఫార్మల్ డ్రెస్ అంటే కనీసం కోటు వేసుకోవాలని అన్నారు. కాలర్ ఓపెన్‌గా ఉంచకూడదని వివరించారు.
ఆనంద్ కిశోర్ జడ్జీ వ్యాఖ్యలపై స్పందించారు. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సమ్మర్‌లో కోట్ ధరించాలనే అధికారిక నిబంధనలు ఏవీ లేవని సమాధానం చెప్పారు. ఆయన వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు.
కోర్టుకు వచ్చేటప్పుడు కచ్చితంగా ప్రాపర్ డ్రెస్ కోడ్ మెయింటెయిన్ చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇదేమైనా సినిమా హాల్ అనుకుంటున్నావా? అంటూ నిలదీశారు.