ఎల్ఏసీలో ఘర్షణలకు ఇండియానే కారణం: చైనా రక్షణ మంత్రి.. అమెరికాపై విమర్శలు

Published : Jun 12, 2022, 04:07 PM IST
ఎల్ఏసీలో ఘర్షణలకు ఇండియానే కారణం: చైనా రక్షణ మంత్రి.. అమెరికాపై విమర్శలు

సారాంశం

లడాఖ్‌లో ఘర్షణలకు భారతే కారణం అని చైనా రక్షణ హంత్రి వెయ్ ఫెంగె ఆరోపించారు. భారత్ వైపు పెద్ద మొత్తంలో ఆయుధాలను మోహరించారని అన్నారు. అయితే, ఇప్పుడు మళ్లీ శాంతి పునరుద్ధరించడానికి చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు పురోగతి సాధిస్తున్నాయనీ వివరించారు.

న్యూఢిల్లీ: లడాఖ్‌లో భారత్, చైనా దేశాల సేనల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఘర్షణలు జరిగిన ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనలేదు. శాంతి పునరుద్ధరించడానికి ఉభయ దేశాల మధ్య ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 15 రౌండ్ల మిలటరీ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంగె భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. లడాఖ్‌లో హింసాత్మక ఘర్షణలకు భారతే కారణం అని ఆరోపించారు. అంతేకాదు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు.. భారత్, చైనా పొరుగు దేశాలు కాబట్టి.. అవి ఐక్యంగా ఉంటే ఉభయ దేశాలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఉచిత సలహా సెలవిచ్చారు. సింగపూర్‌లోని షాంగ్రి లా డైలాగ్ 2022 జరుగుతున్నది. ఇందులో చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంగె మాట్లాడారు.

లడాక్‌లో ఘర్షణలకు భారతే కారణం అని చైనా రక్షణ మంత్రి అన్నారు. తాను ఈ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి పరిస్థితులు చూస్తున్నానని తెలిపారు. భారత్ వైపు పెద్ద సంఖ్యలో ఆయుధాలు కనిపించాయని వివరించారు. అంతేకాదు, వారు కొంతమందిని చైనా భూభాగంలోకి పంపారని ఆరోపించారు. అయితే, ఇప్పుడు శాంతి నెలకొల్పడానికి ఉభయ దేశాలు చర్చలు జరుపుతున్నాయని, అవి పురోగతి కూడా సాధిస్తున్నాయని చెప్పారు.

ప్రపంచం నేడు అరుదైన సమస్యలతో తల్లడిల్లుతున్నదని అన్నారు. ఇది బహుళపక్ష విధానాలకు దారి తీస్తున్నదని తెలిపారు. అలాగే, శాంతి, పురోగతి అనేవి ప్రపంచ మానవాళి అందరికీ సంబంధించిన లక్ష్యాలు అని వివరించారు.

ఆయన తన ప్రసంగంలో అమెరికాపైనా నిప్పులు కురిపించారు. బహుళపక్ష విధానాల ముసుగులో అమెరికా దాని స్వంత ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నదని చెప్పారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లోనూ తమ ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాయని, ముఖ్యంగా చైనాను ఎదుర్కోవడానికి ఇతర దేశాల మద్దతు కోసం పాకులాడుతున్నదని ఆరోపణలు సంధించారు.

ఇదే సందర్భంగా ఆయన ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కూడా ప్రస్తావించారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి చైనా వ్యతిరేకం అని స్పష్టం చేశారు. అయితే, అందుకు రష్యాపై ఆంక్షలూ సరికాదని పేర్కొన్నారు. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడమే పరిష్కారం కాదని అన్నారు. చర్చల ద్వారా ఉభయ దేశాలు తమ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అందుకు సహకరించడానికి చైనా కూడా సిద్ధంగా ఉన్నదని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?