రాహుల్ గాంధీని వెంటాడుతున్న కష్టాలు.. సమన్లు జారీచేసిన పాట్నా కోర్టు..

Published : Mar 30, 2023, 03:22 PM IST
రాహుల్ గాంధీని వెంటాడుతున్న కష్టాలు.. సమన్లు జారీచేసిన పాట్నా కోర్టు..

సారాంశం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీని కష్టాలు వీడటం లేదు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం కేసులో పాట్నా కోర్టు ఆయనకు సమన్లు ​​జారీ చేసింది.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీని కష్టాలు వీడటం లేదు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్‌లోని సెషన్స్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే తాజాగా.. మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పాట్నా కోర్టు ఆయనకు సమన్లు ​​జారీ చేసింది. మోదీ ఇంటిపేరు ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినందుకు రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ క్రిమినల్ పరువునష్టం అభియోగాలు మోపారు.

అయితే ఈ పిటిషన్‌పై వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి రాహుల్ గాంధీకి పాట్నా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 12న తమ ముందు హాజరుకావాలని  తెలిపింది. రాహుల్ గాంధీ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. అయితే రాహుల్ కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. 

ఇక,ఇందుకు సంబంధించి సుశీల్‌ కుమార్‌ మోదీతో పాటు మాజీ మంత్రి నితిన్‌ నవీన్‌, బంకీపూర్‌ ఎమ్మెల్యే, బీజేపీ నేత సంజీవ్‌ చౌరాసియా, బీజేవైఎం నేత మనీష్‌ కుమార్‌ ఇప్పటికే కోర్టులో సాక్షులుగా తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. ‘‘ఫిర్యాదుదారు తరపు సాక్షులందరి వాంగ్మూలాలు నమోదు చేయబడ్డాయి. అన్ని సాక్ష్యాలు సమర్పించబడ్డాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ వాంగ్మూలం కోసం కేసు పెండింగ్‌లో ఉంది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఏప్రిల్ 12 తేదీగా నిర్ణయించబడింది’’ అని ఈ కేసులో సుశీల్ మోదీ తరఫు న్యాయవాది చెప్పారు. ఇక, సుశీల్ మోదీ 2019లో ఈ కేసు దాఖలు చేశారు. 

ఇదిలా ఉంటే.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.. సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌ను సూరత్‌లోని కోర్టు జనవరి 23 దోషిగా తేల్చింది. 

రెండేళ్ల జైలు శిక్షను  కూడా విధించింది. అయితే కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. అయితే సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో రాహుల్‌పై లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్  గాంధీ వయనాడ్ నుంచి విజయం సాధించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu