ఢీ అంటే ఢీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దారామయ్యపై యెడియూరప్ప తనయుడు పోటీ!

By Mahesh KFirst Published Mar 30, 2023, 2:18 PM IST
Highlights

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వేడి రాజుకుంది. కాంగ్రెస్ దిగ్గజ నేత సిద్దారామయ్యపై యెడియూరప్ప తనయుడు పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. సిద్దారామయ్యపై తన కొడుకు పోటీ చేస్తాడనే సంకేతాలను యెడియూరప్ప ఇచ్చారు. ఈ మేరకు ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతున్నదని వివరించారు.
 

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. షెడ్యూల్‌కు ముందే ఇక్కడ ఎన్నికల వాతావరణం మొదలైంది. పోరాట ఎజెండాలను ప్రకటించుకుని బరిలోకి దిగాయి. సిద్దారామయ్య, డీకే శివకుమార్ సారథ్యంలో కర్ణాటక బరిలో నిలవగా.. సీఎం బసవరాజు బొమ్మై కాకుండా మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప సారథ్యంలో బీజేపీ రంగంలోకి దూకింది. సై అంటే సై అనుకుంటూ సవాళ్లు సైతం విసురుకోవడం మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్ దిగ్గజ నేత సిద్దారామయ్య పై బీఎస్ యెడియూరప్ప కొడుకు పోటీకి దిగబోతున్నట్టు బీఎస్ యెడియూరప్ప ఈ రోజు సంకేతాలు ఇచ్చారు.

సిద్దారామయ్య మైసూరులోని వరుణ అసెంబ్లీ స్థానం నుంచి నిలబడుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సిద్దారామయ్య కొడుకు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే స్థానంలో బీఎస్ యెడియూరప్ప కొడుకు బీవై విజయేంద్ర కూడా పోటీకి దిగబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ స్థానం నుంచి బీవై విజయేంద్ర పోటీకి దిగడంపై ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతున్నదని, త్వరలోనే నిర్ణయం వెల్లడవుతుందని అన్నారు. 

ఎన్నికల కమిషన్ కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన మరుసటి రోజే బెంగళూరులో నిర్వహించిన ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బీఎస్ యెడియూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. మే 10న పోలింగ్, 13న ఫలితాలు.. పూర్తి వివరాలు ఇవే..

రిజర్వేషన్ పై ఆందోళనలు జరుగుతున్న తరుణంలో బీఎస్ యెడియూరప్ప ఫైర్‌ఫైటింగ్ మోడ్‌లోకి వచ్చారు. దీటుగా వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

లింగాయత్‌లు, ఇతర కమ్యూనిటీలకు రిజర్వేషన్‌ న్యాయబద్ధమైనదేనని, ఇందులో ముస్లింలకూ ఏ అన్యాయమూ జరగలేదని యెడియూరప్ప అన్నారు. ముస్లింలు ఇక పై ఆర్థికంగా బలహీన వర్గాల కోటాలో రిజర్వేషన్లు పొందుతారని తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. కర్ణాటకలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించ నున్నట్టుగా  సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మే 10న పోలింగ్ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టుగా తెలిపారు. షెడ్యూల్.. ఏప్రిల్ 13 గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ.. ఏప్రిల్ 20. నామినేషన్‌ ల పరిశీలన.. ఏప్రిల్ 21.  నామినేషన్‌ల ఉపసంహరణ  గడవును ఏప్రిల్ 24 గా నిర్ణయించారు. మే 10న పోలింగ్ నిర్వహించనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

click me!