దేశ రాజధానిలో మరో ఘోరం... ఐసియులో పేషెంట్ పై అత్యాచారం

By Arun Kumar PFirst Published Oct 29, 2020, 9:53 AM IST
Highlights

అనారోగ్యంతో బాధపడుతున్న తనపై ఆస్పత్రి సిబ్బంది ఒకడు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి రాతపూర్వకంగా తెలిపింది. 

న్యూడిల్లీ: దేశ రాజధాని న్యూడిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదు.  ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ ను కూడా కామాంధుడు వదిలిపెట్టలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తనపై ఆస్పత్రి సిబ్బంది ఒకడు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి రాతపూర్వకంగా తెలిపింది. 

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డిల్లీ శివారులోని గురుగ్రామ్ ప్రాంతంలోని ఫోర్టిస్ హాస్పిటల్ లో 21ఏళ్ల ఓ యువతి క్షయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఐసియూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతున్న ఆమెపై కనీసం జాలిపడకుండా కామ వాంఛతో కన్నేసాడో ఉద్యోగి.  స్పృహలో లేని సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే తనపై జరిగుతున్న అఘాయిత్యం గురించి తెలుస్తున్నా అడ్డుకోలేని పరిస్థితిలో వున్న యువతి కాస్త కోలుకున్నాక తన తండ్రికి ఈ విషయాన్ని తెలియజేసింది. మాట్లాడలేని పరిస్థితిలో వున్న ఆమె ఓ కాగితంపై తనపై అత్యాచారం జరిగినట్లు... నిందితుడి వివరాలను తెలియజేస్తూ వ్రాతపూర్వకంగా తెలిపింది. దీంతో తన కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హాస్పిటల్ సిబ్బందిని విచారించి నిందితున్ని గుర్తించారు. ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వికాస్ ఈ పని చేసినట్లు గుర్తించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 376(2)ఇ కింద అతడిపై కేసు నమోదు చేశారు. 

click me!