Aatmanirbhar Bharat: విద్యా సంస్థలకు కేంద్రం ఊరట.. పేటెంట్ ఫీజులపై 80శాతం తగ్గింపు

By telugu teamFirst Published Sep 23, 2021, 2:54 PM IST
Highlights

విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆవిష్కరణల పేటెంట్ ఫీజులను 80 శాతం మేరకు తగ్గించనుంది. ఆవిష్కరణలకు విద్యా సంస్థలు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజులు అత్యధికంగా ఉంటుండటంతో అది పరోక్షంగా సృజనాత్మకపై ప్రతికూల ప్రభావం వేస్తున్నది. దీన్ని నివారించడానికే కేంద్రం పేటెంట్ చట్టాన్ని సవరించింది.
 

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్(Aatmanirbhar Bharat) మిషన్‌లో భాగంగా కేంద్రం మరో సంచనల నిర్ణయం తీసుకుంది. ఈ సారి విద్యా సంస్థలకు భారీ ఊరట ఇచ్చింది. విద్యా సంస్థల(Educational Institutions) పేటెంట్(Patent) ఫైలింగ్, ప్రాసిక్యూషన్‌లకు సంబంధించిన ఫీజుల(Fees)ను 80శాతం మేరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. పేటెంట్ రూల్స్‌కు సంబంధించిన ఈ సవరణను కేంద్రం నోటిఫై చేసింది. ఈ నెల 21 నుంచే ఈ ఊరట అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడైంది.

మేధోరంగంలో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల ప్రాధాన్యతను గుర్తించడానికి, వాటిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు దన్నుగా నిలవడానికి, పారిశ్రామిక రంగానికి, విద్యారంగానికి మధ్య సమన్వయాన్ని పెంచడానికి తాజా నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. పేటెంట్ ఫీజులను 80శాతం తగ్గించడమే కాదు, ఆ ప్రక్రియ వ్యవధినీ కుదించినట్టు వివరించింది.

పేటెంట్ చట్టాలను సవరించడం ద్వారా జాప్యాన్ని నివారించి, యూజర్ ఫ్రెండ్లీ, ఈ ట్రాన్సాక్షన్, ఇతర సౌకర్యాలను తేనుంది. ఇందులో భాగంగా కొత్త ఎగ్జామినార్లను నియమించుకోనుంది. దరఖాస్తులు, పేటెంట్‌లు కల్పించడాన్ని పూర్తిగా ఆన్‌లైన్ చేయనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను పరిశీలించనుంది. ఇతర కీలక అంశాలను ప్రస్తుత కాలానికి అనుకూలంగా మార్చి పేటెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది.

click me!