పాక్ కి హైదరాబాదుకు బదులు కశ్మీర్

Published : Jun 26, 2018, 05:13 PM IST
పాక్ కి హైదరాబాదుకు బదులు కశ్మీర్

సారాంశం

కశ్మీర్ విషయంపై కాంగ్రెసు సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంపై కాంగ్రెసు సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కశ్మీర్ స్వాతంత్ర్యంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెసు పార్టీ చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆయన మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. 

ఆయన రచించిన "గ్లిమ్‌ప్సెస్‌ ఆఫ్‌ హిస్టరీ అండ్‌ స్టోరీ ఆఫ్‌ స్ట్రగుల్‌" పుస్తకావిష్కరణ సభ సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత స్వాతం‍త్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కశ్మీర్‌ను పాక్‌కు ఇచ్చేందుకు సిద్దమయ్యారని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ మాత్రం కశ్మీర్ తమతోనే ఉండాలని చెప్పారని ఆయన అన్నారు.

హైదరాబాద్‌కు బదులు పాక్‌కు కశ్మీర్‌ను ఇచ్చేలా పటేల్‌ ప్రతిపాదించారని, అప్పటి పాక్‌ ప్రధాని లిఖ్వాత్‌ అలీఖాన్‌తో చర్చలు జరిపేటప్పుడు పటేల్‌ హైదరాబాద్‌ ప్రస్తావన తీసుకురావద్దని కోరారని చెప్పారు. హైదరాబాద్‌ బదులు కశ్మీర్‌ను పాక్‌ తీసుకోవచ్చునని పటేల్ చెప్పారని, ఖాన్‌ యుద్ద సన్నాహాలు ప్రారంభించినప్పటికీ పటేల్‌ మాత్రం ఆ దిశలో చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. 

ఆ పుస్తకాన్ని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆవిష్కరించాల్సి ఉంది. పార్టీ నిర్ణయం మేరకు ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే, తన పుస్తకావిష్కరణతో కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని సోజ్ చెప్పారు. అది తన పుస్తకమని, అందులోని విషయాలకు తానే బాధ్యుడినని, పార్టీకి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.

 కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మాత్రం జమ్మూ కశ్మీర్‌ కాంగ్రెస్‌ కమిటీ సోజ్‌పై తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నుంచి జైరామ్‌ రమేశ్‌ హాజరయ్యారు.

చరిత్ర బరువును ప్రతి ఒక్కరూ దించుకోవాలని, కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని ప్రముఖ జర్నలిస్టు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి అన్నారు. పాకిస్తాన్ విషయంలో గానీ చైనా విషయంలో గానీ బిజెపి ప్రభుత్వానికి ఓ విధానమంటూ లేదని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu