రేపటి నుంచి ప్యాసెంజర్ రైళ్ల పరుగులు: నేటి నుంచి బుకింగ్స్

By telugu team  |  First Published May 11, 2020, 7:05 AM IST

దేశ రాజధాని ఢిల్లీ నుంచి రేపటి నుంచి ప్యాసెంజర్ రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు భారత రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుంచి 15 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.


న్యూఢిల్లీ: ప్యాసెంజర్ రైళ్లను మంగళవారం నుంచి దశలవారీగా ప్రారంభించాలని భారత రైల్వే నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీన లాక్ డౌన్ ముగియడానికి ఐదు రోజుల ముందు నుంచే రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. ఈ మేరకు భారత రైల్వే ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

బుకింగ్స్ ఈ రోజు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతాయి. టికెట్లను ఐఆర్సిటీసీ వెబ్ సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విక్రయిస్తారు. అన్ని స్టేషన్లలోనూ కౌంటర్సు మూసే ఉంటాయి. టికెట్ ఏజెంట్ల ద్వారా బుకింగ్స్ ను అనుమతించరు. 

Latest Videos

దేశంలో ప్యాసెంజర్ రైళ్లు మార్చి 25వ తేదీ నుంచి ఆగిపోయాయి. రేపటి నుంచి 15 ప్రత్యేక రైళ్లతో పరుగులు ప్రారంభమవుతాయి. ఈ రైళ్లు ఢిల్లీ నుంచి అస్సాం, బెంగాల్, బీహార్, చత్తీస్ డగ్, గుజరాత్. జమ్ము, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, త్రిపురల్లోని నగరాలను కనెక్ట్ చేస్తూ నడుస్తాయి. 

నిర్ధారించిన టికెట్లు ఉన్నవారిని మాత్రమే ఢిల్లీలోని రైల్వే స్టేషన్ లోకి అనుమతిస్తారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. భౌతిక దూరం కూడా పాటించాలి. పరిమిత స్టాపులతో అన్ని రైళ్లలో కూడా ఏసీ కోచ్ లు మాత్రమే ఉంటాయి. 

ఈ రైళ్లు న్యూఢిల్లీ నుంచి డిబ్రూగర్, అగర్తాల, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాదు, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మాడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావిలను కలుపుతూ నడుస్తాయి. 

ఈ నెల 12వ తేదీ నుంచి ప్యాసెంజర్ రైళ్లు ప్రారంభమవుతున్న విషయాన్ని రైల్వే మంత్రి పియూష్ గోయల్ ధ్రువీకరించారు. న్యూఢిల్లీ నుంచి దేశంలో ముఖ్యమైన నగరాలను కలుపుతూ 15 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ఆయన ట్వీట్ చేశారు.

click me!