
న్యూఢిల్లీ: భారత మూలాలున్న ఓ అమెరికా పౌరుడు విమానంలో వీరంగం సృష్టించాడు. లండన్ నుంచి ముంబయికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో లావెట్రీలోకి వెళ్లి సిగరెట్ తాగాడు. అలారం మోగగానే సిబ్బంది వెంటనే లావెట్రీ వద్దకు వెళ్లి.. చేతిలో సిగరెట్ వెలిగిస్తున్న 37 ఏళ్ల రమాకాంత్‌ను సిబ్బంది పట్టుకున్నారు. నిలదీయగా వితండవాదం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కూడా విమానంలో గలాటకు దిగాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
ఆ విమానం ముంబయిలో ల్యాండ్ కాగానే రమాకాంత్‌ను పోలీసులకు అప్పగించారు. సహర్ పోలీసు స్టేషన్‌లో రమాకాంత్ పై కేసు నమోదైంది.
ఏం జరిగిందంటే?
‘విమానంలో స్మోకింగ్ నిషేధం. కానీ, అతను వాష్ రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించాడు. అలారం వచ్చింది. సిబ్బంది వెంటనే వాష్ రూమ్ వైపు వెళ్లింది. సిగరెట్ చేతిలో పట్టుకున్న రమాకాంత్‌ను పట్టుకున్నారు. వెంటనే సిగరెట్‌ను పడేశారని ఓ ఉద్యోగి సహార్ పోలీసులకు తెలిపాడు.
Also Read: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్‌లో ట్విస్ట్ : హానీట్రాప్ ను గుర్తించిన పోలీసులు
‘అప్పుడు మా సిబ్బంది అందరిపైనా రమాకాంత్ వాగ్వాదానికి దిగాడు. ఎలాగోలా మేం అతన్ని సీటు వద్దకు తీసుకెళ్లగలిగాం. ఆ తర్వాత విమానం డోర్ ఓపెన్ చేశాడు. అతి ప్రవర్తనతో ప్రయాణికులందరూ భయాందోళనలకు గురయ్యారు. అనంతరం ఓ జిమ్మిక్ చేశాడు. మేం చెప్పే మాటలను అతను వినడం లేదు. మాపైనా అరుస్తూనే ఉన్నాడు. దీంతో అతని కాళ్లు, చేతులు కట్టేసి సీటుపై కూర్చోబెట్టాం’ అని క్రూ మెంబర్ చెప్పాడు. కాళ్లు చేతులు కట్టేస్తే తలతో సీటును కొట్టడం మొదలు పెట్టాడని ఆరోపించాడు.
‘ఆ ప్రయాణికుల్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన వెంటనే రమాకాంత్ వద్దకు రాగా.. బ్యాగ్‌లో తన మెడిసిన్ ఉన్నదని అన్నాడు. తాము వెతికి చూడగా ఆ బ్యాగ్‌లో ఈ సిగరెట్ తప్పితే మెడిసిన్ లేదు’ అని వివరించాడు. అతని మానసిక ఆరోగ్యం ఎలా ఉన్నది? ఆ సమయంలో మద్యం మత్తుతో ఉన్నాడా? అనే విషయాలను తెలుసుకోవడం కోసం శాంపిళ్లను మెడికల్ టెస్టుకు పంపించామని చెప్పాడు.
ఈ ఘటనను ఎయిర్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించాడు. మార్చి 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుందని, రెగ్యులేటరీకి వివరాలు అందించామని చెప్పాడు. ఈ విచారణకు అన్ని విధాల సహకరిస్తామని తెలిపాడు.