తెర మీదికి వచ్చిన మరో వివాదం.. విమానంలో అందించిన ఆహారంలో రాళ్లు.. క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా

By Rajesh KarampooriFirst Published Jan 10, 2023, 11:46 PM IST
Highlights

ఎయిరిండియా విమానంలో మరో వివాదాస్పద ఉదంతం తెరపైకి వచ్చింది. జనవరి 8న ఎయిరిండియా విమానంలో అందించిన ఆహారంలో రాళ్లు ఉన్నాయని ఓ ప్రయాణికురాలు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.ఆమెకు అందించిన ఆహారానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

ఎయిరిండియా విమానంలో సహ ప్రయాణికురాలిపై  ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన వివాదం ఇంకా చల్లారకపోవడంతో మరో వివాదాస్పద ఉదంతం తెరపైకి వచ్చింది. అయితే.. ఈసారి టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ పై ఫిర్యాదు చేయబడింది.  ఎయిరిండియా విమానం ఆహారంలో రాళ్లు ఉన్నాయని ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుపై విమానయాన సంస్థ మంగళవారం స్పందించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఆహారాన్ని అందించిన క్యాటరర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిరిండియా హామీ ఇచ్చింది. 

వివరాల్లోకెళ్లే..  జనవరి 8న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు అందించిన ఆహారంలో రాళ్లు కనిపించాయి. దీంతో సదరు మహిళా ప్రయాణికుడు ట్విట్టర్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. AI 215 విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన ఆహారంలో రాయి కనిపించినట్టు, నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆరోపిస్తూ పోస్ట్ చేశారు. ఆమె ఆహారంలో రాళ్లను కనుగొన్న చిత్రాలను కూడా పంచుకుంది. ఈ విమానం ఢిల్లీ నుంచి ఖాట్మండుకు వెళుతుండటం గమనార్హం.

ఈ ఘటనపై ఎయిరిండియా అధికార ప్రతినిధి మంగళవారం వివరణ ఇచ్చారు. ఏఐ 215 విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి ఆహారంలో చిన్న రాయి ముక్క కనిపించడంతో ఎయిర్ ఇండియా సీరియస్ అయింది. ఈ సంఘటనకు తాము తీవ్రంగా చింతిస్తున్నామనీ,  ప్రయాణికురాలికి క్షమాపణలు చెప్పింది. ఈ విషయమై క్యాటరర్‌తో విచారణ చేపట్టామని, క్యాటరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని ప్రతినిధి తెలిపారు.

జనవరి 8న ప్రయాణికురాలు సర్వప్రియ సంగ్వాన్ ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ.. 'రాళ్లు లేని ఆహారాన్ని అందించడానికి మీకు వనరులు, డబ్బు అవసరం లేదు' అని ట్వీట్ చేసింది. దీనితో పాటు, విమానంలో అందించిన ఆహారం సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ.. 'ఈ ఆహారం AI 215లో వడ్డించే ఆహారం' అని రాసుకోచ్చింది. ఆమె ట్వీట్‌కు ఎయిర్ ఇండియా రిప్లై ఇచ్చింది. ఇది ఆందోళన కలిగించే విషయమని, వెంటనే మా క్యాటరింగ్ టీమ్‌తో దీన్ని తీసుకెళ్తున్నామని కంపెనీ ట్వీట్ చేసింది.

ఇటీవలి కాలంలో..టాటా గ్రూపుకు చెందిన ఎయిర్ ఇండియా వివాదాల్లో చిక్కుకుంది. అంతర్జాతీయ ప్రయాణీకులు పట్ల దురుసుగా ప్రవర్తించిన సంఘటనలను నమోదుకావడంతో కంపెనీపై  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిప్పులు చెరుగుతుంది. రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

click me!