
సాగు చట్టాల రద్దు బిల్లుకు (Farm Laws Repeal Bill) లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్యనే సాగు చట్టాల రద్దు బిల్లును (Farm Laws Repeal Bill, 2021) వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్టుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. తర్వాత విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
Also read: Parliament winter session: ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రధాని నరేంద్ర మోదీ
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం.. తొలి రోజే పార్లమెంట్ ముందుకు సాగు చట్టాల రద్దు బిల్లును తీసుకువచ్చింది. అయితే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సమయంలో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. బిల్లుపై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్‌తో పాటుగా ఇతర విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అయితే సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు.
అంతకుమందు ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ (Lok Sabha ) ప్రారంభం కాగానే ఇటీవల ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం ఇటీవలి కాలంలో మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ నివాళులర్పింది. ఆ తర్వాత రైతుల సమస్యలపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు ఫ్లకార్డులతో సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) సభ మర్యాదను పాటించాలని సభ్యలకు సూచించారు. అయితే విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన సభ.. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది.
విపక్షాల వాయిదా తీర్మానాల తిరస్కరణ..
విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. సాగు చట్టాలు, రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. . ధాన్యం సేకరణపై కేంద్రం వివక్షపై చర్చ చేపట్టాలని లోక్‌సభలో నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇప్పటికీ వరి ధాన్యం కల్లాల్లోనే ఉందన్న రేవంత్ రెడ్డి.. రైతుల ఇబ్బందులపై చర్చించాలని కోరారు.
ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాం.. మోదీ
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశం పైనైనా చర్చకు, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశాలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు అని తెలిపారు. పార్లమెంట్‌లో సమస్యల గురించి ప్రస్తావించవచ్చని.. కానీ పార్లమెంట్, స్పీకర్ చైర్ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.
కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి డిసెంబర్ 23 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో.. కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ నియంత్రణ, విద్యుత్ చట్ట సవరణ, బ్యాంకింగ్ సంస్కరణ ఇతర బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. అయితే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దతపై, సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విపక్షాలు గట్టిగా కేంద్రాన్ని కోరనున్నాయి. సాగు చట్టాలను కేంద్రం మరో రూపంలో తీసుకు వస్తుందని అనుమానిస్తున్న విపక్షాలు.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వివరంగా సమాధానం చెప్పాలిన డిమాండ్ చేయనున్నాయి.